హనుమకొండ చౌరస్తా, మార్చి 11: రాష్ర్టంలోని స్పోర్ట్స్స్కూళ్లలో 2026- 27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుంది. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న బాలురు, బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతి, ఆహారం, ప్రొఫెషనల్ క్రీడా శిక్షణ అందించనున్నట్లు హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ తెలిపారు.
ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించనునట్లు, మండల, జిల్లా, రాష్ర్ట స్థాయిల్లో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు గురువారంలోపు ఆన్లైన్ వెబ్సైట్ tgss. telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.