హనుమకొండ చౌరస్తా, జూలై 22 : కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి, తెలంగాణ విమోచనోద్యమ యోధుడు దాశరధి కృష్ణమాచార్య 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు విభాగాధ్యక్షులు డాక్టర్ మామిడి లింగయ్య దాశరథి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దాశరధి కేవలం కవి మాత్రమే కాకుండా ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అని, తెలంగాణ భాష, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన మహనీయుడిగా దాశరథి చిరస్థాయిగా నిలిచారన్నారు.
ఆయన సాహిత్యంలో దేశభక్తి, మానవత, సామాజిక సమానత్వం వంటి విలువలు ప్రతిఫలించాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ చిర్ర రాజు, అధ్యాపకులు కర్రే సదాశివ్, అన్నపూర్ణ, బానోత్ స్వామి, పీజీ విద్యార్థులు పాల్గొని దాశరధి సాహిత్య వారసత్వాన్ని స్మరించుకున్నారు.