రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీల సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచింది. అలాగే రిటైర్మెంట్ సమయంలో టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు రూ. 50వేలు అందజేయనున్నది. ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేసియా సౌకర్యం కల్పించింది. అంగన్వాడీ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నది. దురదృష్టవశాత్తు మరణిస్తే తక్షణ ఆర్థికసాయం ఇవ్వనున్నది. విరమణ చేసిన మరుసటి నెల నుంచి ఆసరా పింఛన్ అందించాలని నిర్ణయించింది. ఉత్తర్వు కాపీని ఇటీవల అంగన్వాడీ యూనియన్ల నాయకులకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హనుమకొండ జిల్లాలోని 27 మినీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.
– హనుమకొండ, అక్టోబర్ 1
హనుమకొండ, అక్టోబర్ 1 : దేశంలో ఎక్కడ లేని విధంగా అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అంగన్వాడీ కేంద్రాలపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. సెంటర్లను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నది. అదే విధంగా అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసేందుకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నది. చిన్నారులకు ఆటా పాటలతో విద్యను బోధిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటు అనంతరం అంగన్వాడీ టీచర్ల వేతనం మూడు సార్లు పెంచారు. తాజాగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరణతో హెల్పర్ టీచర్‌గా అప్‌గ్రేడ్ అవుతున్నారు. ఒక హెల్పర్ పోస్టు అదనంగా రానుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కాగా, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లాలో 772 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు, 27 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 27 మినీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విరమణ వయసు పెంపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ణయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా విరమ ణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ. 50వేల ఆర్థికసాయం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 50 ఏండ్లలోపు ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ. 2లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 50 ఏండ్ల పైబడిన వారికి రూ. 2లక్షలు ఎక్స్‌గ్రేసియా ఇవ్వనున్నది. సర్వీస్‌లో ఉండగా మరణిస్తే తక్షణ సాయం కింద రూ. 20వేలు, హెల్పర్లకు రూ.10 వేలు అందించనున్నది. ఇక నుంచి ప్రతి నెలా 14వ తేదీ లోపు జీతాలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమస్యల పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలోనే అత్యధిక వేతనాలు..
అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వేతనాలు పెంచారని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీలను పట్టించుకోకున్నప్పటికీ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ వారి సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు.
మారనున్న సెంటర్ల రూపురేఖలు..
జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని హనుమకొండ ప్రాజెక్టు పరిధిలో 10, పరకాల ప్రాజెక్టు పరిధిలో 4, భీమదేవరపల్లి ప్రాజెక్ట్ పరిధిలో 13 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ సెంటర్ల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటి వరకు మినీ అంగన్వాడీల్లో టీచరే ఆయాగా విధులు నిర్వర్తించేవారు. తాజా నిర్ణయంతో ఒక ఆయా పోస్టు రావడంతో పాటు మినీ అంగన్వాడీ టీచర్‌గా ఉన్న వారు మెయిన్ అంగన్వాడీ టీచర్‌గా మారనున్నారు. వేతనం కూడా రూ. 13,500లకు పెరుగనున్నది.
అంగన్వాడీలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారు..
పీ సరస్వతి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు, హనుమకొండ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీలకు పీఆర్సీ ఇవ్వనున్న సీఎం కేసీఆర్‌కు అంగన్వాడీలు రుణపడి ఉంటా రు. గత ప్రభుత్వాలు అంగన్వాడీలను విస్మరించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. స్వయం గా సీఎం అంగన్వాడీలతో ముఖాముఖి నిర్వహించి అన్నం పెట్టి జీతాలు పెంచారు. అంగన్వాడీ వర్కర్‌ను టీచర్‌గా నామకరణం చేసి మా హోదా పెంచారు. ఇతర రాష్ర్టాల్లో ఎకడా లేని విధంగా మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తున్న ఆయనకే దక్కుతుంది.
విరమణ వయస్సు 65ఏండ్లు అభినందనీయం
అంగన్వాడీల విరమణ వయ స్సు 65 ఏండ్లు నిర్ణయిచండం అభినందనీయం. గతంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ చనిపోతే గత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మేమే చందాలు వేసుకొని ఆ కుటుంబానికి సహాయం చేసే వాళ్లం. ఇపుడు సీఎం కేసీఆర సర్వీసులో ఉన్న అంగన్ వాడీ టీచర్, హెల్పర్ దురదృష్టవశాత్తు చనిపోతే తక్షణ సాయంగా టీచర్‌కు రూ. 20వేలు, హెల్పర్‌కు రూ.10వేలు ఇస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.