కృష్ణకాలనీ, మార్చి 24 : ప్రకృతి అందాలకు కొత్తందం తీసుకొచ్చే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి పండుగ హోలీ. రంగుల పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్నా పెద్దా, ఊరువాడా ఏకమై రంగుల్లో తడిసిముద్దవుతారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబురాల్లో మునిగితేలుతారు. హోలీకంటే ముందు కామదహనం చేస్తారు. హోలీ పండుగ ఈనాటిది కాదని, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణపరమాత్ముడు జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. హోలికా అనే రాక్షసి అంతమైన రోజును పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుకునేవారు. వసంత మాసం ఆగమానికి గుర్తుగా వసంతకేళీ ఆడడం ఆనవాయితీ గా వచ్చిందని మరికొందరు చెబుతారు. దేశం మొత్తం మీద హోలీ పండుగను వసంత మాసంలో వచ్చే హేలికా పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటారు. హోలీ వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. వ్యాపారస్తులు తీరొక్క రంగులను అందుబాటులో ఉంచారు. కాగా, హోలీ పండుగకు సహజ సిద్ధమైన రంగులనే వాడాలని, రసాయనిక రంగులను వాడి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.