శాయంపేట, ఆగస్టు 1 : కేజీబీవీలో అపరిశుభ్రత, అసౌకర్యాలకుతోడు క్రమశిక్షణ పేరిట శిక్ష లు విధిస్తుండడంతో భరించలేని విద్యార్థినులు శుక్రవారం అర్ధరాత్రి గోడదూకి పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మాందారిపేట శివారులోని కస్తూ ర్బా బాలికల హాస్టల్లో ఏడు, ఎనిమిది చదువుతున్న ముగ్గురు బాలికలు శుక్రవారం రాత్రి ఒంటి గంట తర్వాత ప్రహరీ దూకి పారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయులు గుర్తించి వెంటనే ప్రత్యేక అధికారి మాధవి, పోలీసులతోపాటు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.
అనంతరం టీచర్లు చుట్టుపకల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో కస్తూర్బా హాస్టల్‌కు సమీపంలోని తోట వద్ద ఉన్న చెట్ల పొదల్లో బాలికలను వారి పేరెంట్స్ గుర్తించి తీసుకొచ్చారు. సెక్యూరిటీ జోన్ ఉండాల్సిన విద్యార్థినులు అర్ధరాత్రి వెళ్లిపోయినా టీచర్లు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ కేజీబీవీని సందర్శించారు. పారిపోయిన ముగ్గురు బాలికలతో మాట్లాడి వాంగ్మూలం తీసుకున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే రోజు టీచర్లు గుంజీలు తీయించడం, మోకాళ్లపై నిలబెడుతున్నారని, ఆహారంలో పురుగులు రావడం, అపరిశుభ్ర టాయ్‌లెట్స్‌తో ఉండలేకపోతున్నామని విద్యార్థినులు చెప్పినట్లు తహసీల్దార్ వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు.