ఆర్అండ్బీ శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వరంగల్ కేంద్రంగా ఒక్కటే సర్కిల్ కార్యాలయం ఉండేది. ప్రస్తుత మార్పుల ప్రకారం హనుమకొండ, భూపాలపల్లి కేంద్రంగా సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్ కార్యాలయం పరిధిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు డివిజన్లు, భూపాలపల్లి సర్కిల్లో భూపాలపల్లి, ములుగు డివిజన్ కార్యాలయాలు ఉంటాయి. జనగామ జిల్లా తాజాగా యాదాద్రి భువనగిరి సర్కిల్ పరిధిలోకి వెళ్లింది. జనగామ డివిజన్లో జనగామ, పాలకుర్తి సబ్ సడివిజన్లు ఉన్నాయి.
– వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. శాఖలోని వ్యవస్థతోపాటు దీనికి అనుగుణంగా పోస్టుల సర్దుబాటు పూర్తయ్యింది. జిల్లాలను, జోన్లను పునర్వ్యవస్థీకరించినా రోడ్లు, భవనాల శాఖలో ఈ మేరకు పూర్తి స్థాయిలో మార్పులు జరుగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదివారం ఈ ప్రక్రియను పూర్తి చేసింది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ నగరం కేంద్రంగా ఒక్కటే సర్కిల్ కార్యాలయం ఉండేది. ప్రస్తుత మార్పుల ప్రకారం హనుమకొండ, భూపాలపల్లి కేంద్రంగా సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలకు డివిజన్ కార్యాలయం ఉండాలనే ప్రతిపాదనతో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగింది. దీనికి అనుగుణంగా భూపాలపల్లితో కొత్తగా డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి జిల్లాలో డివిజన్ కార్యాలయం ఉంటున్నది.
హనుమకొండ సర్కిల్ కార్యాలయం పరిధిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు డివిజన్లు ఉన్నాయి. భూపాలపల్లి సర్కిల్లో భూపాలపల్లి, ములుగు డివిజన్ ఆఫీసులు ఉంటాయి. జనగామ జిల్లా తాజాగా యాదాద్రి భువనగిరి సర్కిల్ పరిధిలోకి మారింది. జనగామ డివిజన్లోని జనగామ, పాలకుర్తి సబ్ సడివిజన్లు ఉన్నాయి. జనగామలో కొత్తగా బిల్డింగ్ విభాగం సబ్ డివిజన్, సెక్షన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్ పరిధిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ డివిజన్లు ఉన్నాయి. హనుమకొండ డివిజన్లో హనుమకొండ, పరకాల సబ్ డివిజన్లు… వరంగల్ డివిజన్లో వరంగల్, నర్సంపేట సబ్ డివిజన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో మహబూబాబాద్, మరిపెడ సబ్ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా గూడూరు సబ్ డివిజన్ ఏర్పాటైంది. బిల్డింగ్స్ విభాగంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ కేంద్రంగా కొత్తగా సబ్ డివిజన్లను హనుమకొండ 2, వరంగల్ 1, వరంగల్ 2, మహబూబాబాద్ 1 పేరుతో కొత్తగా సెక్షన్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో గతంలో భూపాలపల్లి, ములుగు డివిజన్లు ఉండేవి. కొత్తగా కాటారం, ఏటూరునాగారం ఏర్పాటయ్యాయి. అలాగే బిల్డింగ్ విభాగంలోపాలపల్లి, ములుగులో సబ్ డివిజన్లు, సెక్షన్లను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు సర్కిళ్లు
జాతీయ రహదారుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్‌లో ఈ విభాగం సర్కిల్‌ను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ సర్కిల్ పరిధిలో వరంగల్, ఖమ్మం, జనగామ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల వరంగల్, ములుగు, మహబూబాబాద్.. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, తిరుమలగిరి సబ్ డివిజన్లు ఉండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. రోడ్ల నాణ్యతను పర్యవేక్షించే క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) విభాగం సర్కిల్ కార్యాలయం వరంగల్‌లో కొనసాగనున్నది. వరంగల్, కరీంనగర్ డివిజన్లు దీని పరిధిలో ఉంటాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో హనుమకొండ, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల సబ్ డివిజన్లు ఉం డేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఎలక్ట్రికల్ విభాగం సర్కిల్ కార్యాలయాన్ని వరంగల్‌లో కొనసాగనున్నది. దీని పరిధిలో వరంగల్, నిజామాబాద్ డివిజన్లు ఉంటాయి. ఈ రెండు డివిజన్ల పరిధిలో వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట సబ్ డివిజన్లు ఉండేలా ప్రభుత్వం పునర్వ్యస్థీకరణ చేసింది.