వరంగల్ సెప్టెంబర్ 19: కాకతీయ మెడికల్ కళాశాలలో ఓ జూనియర్‌ను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్, దాడి చేసిన ఘటనపై కాకతీయ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపి, ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. మూడు నెలల పాటు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ వసతిని ఏడాది పాటు రద్దు చేస్తూ తీర్మానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ కఠినంగా వ్యవహరించినట్లు తెలిపింది.
కేఎంసీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన మనోహర్ సాలం (2022 బ్యాచ్) ఈనెల 14వ తేదీ రాత్రి కళాశాల లైబ్రరీ నుంచి హాస్టల్ గదికి వెళ్తుండగా హాస్టల్ వద్ద బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు (2021 బ్యాచ్) అభినవ్ మోరే, సిల్వ శ్రీహరి, శ్రీచరణ్, సూర్య ప్రకాశ్, లోకేశ్, సాయికిరణ్, హరికృష్ణ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వేధింపులతో విసుగు చెందిన మనోహర్ సాలంకి ఎదురుతిరగడంతో సీనియర్లు దాడికి పాల్పడ్డారు.
తీవ్రగాయాలతో ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందిన తర్వాత ఈనెల 16వ తేదీన నుంచి డిశ్చార్జ్ అయ్యాక, విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. స్థానిక మట్టెవాడ పోలీసులకు, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్‌కు ఫిర్యాదు చేశాడు. మంగళవారం మధ్యా హ్నం ఒంటిగంట నుంచి రాత్రి 7గంటల వరకు సుదీర్ఘంగా కమిటీ విచారణ జరిపింది. బాధితుడితోపాటు దాడికి పాల్పడిన సీనియర్లను ఒక్కొక్కరిగా, అందరినీ కలిపి విచారణ జరిపారు.
వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆతర్వాత సమావేశం నిర్వహించి ర్యాగింగ్, దాడికి పాల్పడినట్లు తేల్చడంతోపాటు సీనియర్ విద్యార్థులను మూడు నెలలు కళాశాల తరగతుల నుంచి సస్పెండ్ చేయడంతోపాటు హాస్టల్ వసతి ఏడాది పాటు రద్దు చేస్తున్నట్లు తీర్మానించారు. కళాశాల చరిత్రలో ఏడుగురిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి అని కళాశాల సిబ్బంది తెలియజేశారు. ఇప్పటికే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఏడుగురు సీనియర్ విద్యార్థులపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీస్ కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక కీలకం మారింది.