హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27: జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో క్రీడాశిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలంలో పిల్లలకు మానసికోల్లాసం, క్రీడల ఆసక్తితో పాటు వివిధ క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేందుకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ప్రతి ఏటా మాదిరిగానే చిన్నారులు క్రీడా నైపుణ్యం పెంపొందించుకొనేందుకు మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించనుంది. ఈ మేరకు తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ఔట్‌డోర్, ఇండోర్‌లో 20 రకాల క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఏటా వేసవి సెలవులు రావడంతో పిల్లలు పల్లెబాట పడుతున్నారు. శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే నెలరోజుల పాటు చిన్నారులు శిక్షణ తీసుకొని ఆటల్లో రాణిస్తారు. అలాగే, వారి శారీరక, మానసిక దృఢత్వానికి దోహదం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకటి నుంచి శిబిరాలు..
పట్టణ ప్రాంతాల్లో నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు ఇప్పటికే వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలబాలికలు వివిధ రకాల క్రీడాల్లో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారులు మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో శిక్షణ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మందికిపైగా శిక్షణలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
20 రకాల ఆటలు..
హనుమకొండలోని జేఎన్స్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ శిబిరంలో అర్హత కలిగిన కోచ్‌ల పర్యవేక్షణలో మొత్తం 20 రకాల క్రీడల్లో శిక్షణ ఇస్తారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, తైక్వాండో, నెట్‌బాల్, హాకీ, కిక్‌బాక్సింగ్, ఖోఖో, బాక్సింగ్, సాఫ్ట్‌బాల్, యోగా, లాన్టెన్నిస్తో పాటు ఇంకా ఇతర ఆటలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, అత్యధికంగా అథ్లెటిక్స్‌లో వంద మందికిపైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం.
విద్యార్థులకు గొప్ప అవకాశం..
పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను వివిధ రకాల ఇండోర్, ఔట్‌డోర్ కార్యకలాపాల్లో నిమగ్నం చేయడానికి వారి శోధనను ప్రారంభించారు. సాధారణ పాఠశాల విద్య, ట్యూషన్‌తో సాధ్యం కాని వివిధ కార్యకలాపాల ద్వారా కొత్త కళలను నేర్చుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి వేసవి శిబిరం విద్యార్థులకు గొప్ప అవకాశం.
వేసవి క్రీడాశిక్షణాశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. శిబిరంలో 22 రకాల క్రీడా విభాగాల్లో ఉచితంగా కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పించనున్నాం. విద్యార్థులకు ఇది మంచి అవకాశం. వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఈ క్రీడాశిక్షణ శిబిరంలో పాల్గొననున్నారు.
– గుగులోత్ అశోక్‌కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి