మహబూబాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలులో మాత్రం తాత్సారం చేస్తున్నది. ఎప్పుడెప్పుడు రేవంత్ ప్రభుత్వం పథకాలు ప్రారంభిస్తుందోనని ఎదురుచూస్తున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. కొద్ది నెలల క్రితం పథకాల అమలు కోసం మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పైలట్ గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితాలు చదివి, అందులో కొద్దిమందికి మాత్రమే ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
ఒక్కో పథకానికి ఒక్కో కొర్రీ పెడుతూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ పైలట్ గ్రామమైన జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరంలో పర్యటించి పథకాల అమలు విషయమై వాస్తవ వివరాలు సేకరించింది. గ్రామంలో మొత్తం 199 ఇండ్లు, 536 జనాభా ఉంది. ఇక్కడ మొత్తం 150 మంది రైతులుండగా కేవలం 80 శాతం మందికే రైతు భరోసా వచ్చింది. మిగిలిన 20 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వాపోతున్నారు. 50 మంది వ్యవసాయ కూలీలుండగా ఇందులో కేవలం 15 మందికి ఆత్మీయ భరోసా ఇచ్చి మిగిలిన 35 మందికి ఎగనామం పెట్టారు. గ్రామంలో 20 మంది రైతులకు పలు కొర్రీలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టారు.
ఇందిరమ్మ ఇండ్లకు 99 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు కేవలం 29 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇండ్ల మోడల్‌పై అధికారులు అవగాహన కల్పించిన అనంతరం ప్రొసీడింగ్స్ తీసుకున్న 20 మంది నిర్మాణానికి వెనకడుగు వేశారు. మిగిలిన 9 మంది కూడా అనేక అనుమానాలతో పనులు ప్రారంభించలేదు. ఇందిరమ్మ అండ్లకు చాలా మందికి అర్హత ఉన్నా రేషన్‌కార్డు లేదని ఇవ్వలేదు. రేషన్‌కార్డుల కోసం వంద మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, కేవలం 20 మందికి మాత్రమే వచ్చాయి. మిగిలిన 80 మందికి ఆధార్‌కార్డుకు ఫోన్‌నంబర్ లింకు లేదని, పెళ్లి కాక ముందు తండ్రి పేరు మీదున్న కార్డులో ఉన్నారని, అందులో డిలీట్ చేసుకుంటే కొత్తది ఇస్తామంటూ తప్పించుకుంటున్నారు. ఇలా ఒకదానికి ఒకటి కొర్రీ పెట్టి పథకాలకు అర్హత ఉన్నా ఎగ్గొడుతున్నారు.
రుణమాఫీ కాలే..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు నాకు రుణమాఫీ కాలేదు. నేను పెద్దముప్పారం ఎస్బీఐలో రుణం తీసుకున్న. 2018లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 1.30 లక్షల రుణం ఇప్పటి వరకు మాఫీ కాలే. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి నాకెందుకు చేయలేదో చెప్పాలే. బ్యాంకు అధికారులను అడిగితే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తే అప్పుడు మాఫీ చేస్తామంటున్నరు.
-దైద చిన్న సోమయ్య, రైతు, రామవరం, దంతాలపల్లి మండలం
మంజూరు పత్రం ఇచ్చిండ్రు.. ఇప్పుడు రాదంటుండ్రు
నాకు గత జనవరి 26న గ్రామ సభలో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మంజూరు పత్రం ఇచ్చిండ్రు. ఇల్లు కట్టుకుందామని అధికారుల వద్దకు వెళితే జాబితాలో నీ పేరు లేదని చెప్పిండ్రు. మంజూరు పత్రం ఇచ్చిన 15 రోజులకు మా ఊరు కారోబార్ వచ్చి పంచాయతీ కార్యదర్శి సారు నీకు ఇచ్చిన మంజూరు పత్రం ఇవ్వమంటున్నడని చెప్పి తీసుకెళ్లాడు. నా ముగ్గురు పిల్లలతోటి పెంకుటింట్లో ఉంటున్న. వానొస్తే కురుస్తున్నది. నీ పేరు మీద 20 ఏండ్ల కిందట సిమెంట్ తీసుకున్నట్లు ఉంది.. అందుకే ఇల్లు ఇవ్వమని అధికారులు అంటున్నరు. నేను గతంలో ఎప్పుడు సిమెంట్, ఇందిరమ్మ ఇల్లు తీసుకోలేదు. సిమెంట్ ఇచ్చామనే వంకతో ఇల్లు తీసేశారు.
-శోభ, లబ్ధిదారురాలు, రామవరం, దంతాలపల్లి మండలం
వెంకట్రావుపల్లెలోనూ అరకొరే..
వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని వెంకట్రావుపల్లె (పాత బొక్కలగూడెం)ను ప్రభుత్వం పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. ఈ గ్రామంలో పర్యటించిన ‘నమస్తే తెలంగాణ’తో వివిధ పథకాల లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మొత్తం జనాభా 941 మంది కాగా, ఇందులో 769 మంది ఓటర్లున్నారు. ఈ చిన్న గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించి ఇండ్లు, రేషన్ కార్డులులేని పేదలను గుర్తించారు. వీరికి నాలుగు సంక్షేమ పథకాలు అందించాల్సి ఉండగా అరకొరగానే అమలు చేస్తున్నారు. గ్రామంలోని 30 మంది పేదలు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, మరో 20 మంది మార్పులు, చేర్పుల కోసం అర్జీ పెట్టుకొని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.
అలాగే ఇంటి స్థలాలున్న పేదలు 23 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడంతో అందరికీ మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ గత నెలలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా అధికారులు వచ్చి కేవలం నలుగురికే ముగ్గులు పోశారు. అయితే వారి ఇండ్ల నిర్మాణ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కాగా, పైలట్ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, అన్ని పథకాలు 100 శాతం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వెంకట్రావుపల్లెలో నెలవారీగా అయ్యే ఖర్చులతో పాటు పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఏడాదిగా రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పైలట్ గ్రామాలతో పాటు అన్ని ఊళ్లలో అభివృద్ధి నిలిచిపోయింది. నిధుల లేమితో గ్రామాల్లో పలు పనులు చేసేందుకు ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు నానా అవస్థలు పడుతున్నారు.