ఖిలావరంగల్, నవంబర్ 06: ‘ఇటెడు రా అంటే ఇల్లంతా నాదే’ అన్న సామెత వరంగల్ (Warangal) రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) కింద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన దారి (Footpath) విషయంలో అక్షరాలా నిజమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు దారి చూపాల్సిన ఈ మార్గం, ప్రస్తుతం కబ్జాదారులు పాగా వేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పాదచారుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా చిన్న సొరంగ మార్గం లాంటి ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేసింది. సాధారణ సమయాల్లో కంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు నడక దారి ఎంతగానో ఉపయోగపడుతుంది.
రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఒక మార్గంలో మురికి నీరు, మరో మార్గంలో తాగునీరు నిత్యం ప్రవహిస్తోంది. అయితే ఈ నీటి నుంచి నడవ లేక వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌ఫాత్‌ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అలాగే భారీ వర్షాలు కురిసినప్పుడు, రైల్వే అండర్ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ప్రధాన రహదారుల మీదికి వరద నీరు చేరుతోంది. ఆ సమయంలో బస్సులు, లారీలు లాంటి భారీ వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. అయితే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సురక్షితంగా వెళ్లడానికి ఈ ప్రత్యేక ఫుట్‌పాత్ మాత్రమే ఏకైక మార్గం. అలాంటి కీలకమైన దారిని ఆక్రమించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

బ్రిడ్జికి ఇరువైపుల నడకదారికి అడ్డంగా షాపులు.. ఇనుప రాడ్లు
ఈ మధ్యకాలంలో ముఖ్యమైన ఫుట్‌పాత్‌ను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాన్ షాప్, బిర్యానీ సెంటర్, పంక్చర్ షాప్ వంటివి ఏర్పాటు చేసుకొని పాదాచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ట్రాఫిక్ ఐలాండ్‌కు ఆనుకొని రోడ్డుపై పంక్చర్ షాపు నిర్వహిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు తొలిగించాల్సింది పోయి ఆ షాపు యజమానికి సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫుట్ఫాత్ మీది నుంచి కిందికి దిగేందుకు అనువుగా ఉన్న రోడ్డుపై పాదాచారులు నడవ రాకుండా ద్వంసం చేసి వారికి అనుకూలంగా మరమ్మతులు చేపట్టినట్లు స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం కబ్జాదారులు మరింత రెచ్చిపోయి ఏకంగా తమ షెడ్డు నిర్మాణం కోసం ఫుట్పాత్లోనే ఇనుప రాడ్లు పాతారు. దీంతో నడవడానికి కూడా చోటు లేని పరిస్థితి ఏర్పడింది.
ప్రేక్షక పాత్రలో అధికారులు
ప్రజాధనం, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన దారి ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. బల్దియా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, ఈ దారిని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానికులు, నిత్యం ఆ దారి గుండా నడిచే పాదచారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరాల్లో ఉపయోగపడే దారిని తక్షణమే పునరుద్ధరించాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే, ఇది భారీ వర్షాల సమయంలో ప్రజల భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.