కరీమాబాద్, ఫిబ్రవరి 9: వందల ఏళ్లుగా దర్గా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పీఠాధిపతులు నవీద్‌బాబా, ఉబేద్బాబా అన్నారు. ఉర్సులోని దర్గాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న దర్గా 467వ (హజ్రత్ సయ్యద్ జలాలుద్దీన్ షా జమాలుల్ బహర్) (సయ్యదనా మాషుక్ రబ్బానీ) ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఫకీర్ల విన్యాసాల మధ్య 13న రాత్రి ఉర్సు నయాఘడీలోని తమ ఇంటి నుంచి గంధాన్ని తీసుకొచ్చి పవిత్ర సమాధికి (గంధలేపనం) పూస్తామన్నారు. దీంతో ఉత్సవాలు ప్రారం భం అవుతాయన్నారు. 14న ఉర్సు జరుగుతుందని, 15న ముగింపు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ ఇస్లామిక్ వేద పండితులతో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహిసామన్నారు. అలాగే, 3 రోజులపాటు (లంగర్) నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామన్నారు. ఉ త్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుర్ఖాన్, నాయకులు మసూద్, ఎంఏ జబ్బార్, చాంద్‌పాషా పాల్గొన్నారు.