జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : గానుగ నూనె రాజు అలియాస్ బౌతు రాజు. భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలు, జీవన శైలి మూలంగా తండ్రి అనారోగ్యానికి గురై మృతి మృతి చెందడం, తనకు బీపీ రావడం కారణమని తెలుసుకుని రిఫైన్డ్ ఆయిల్‌కు స్వస్తి చెప్పాలనుకున్నాడు. గానుగ నూనె గురించి తెలుసుకున్నాడు. సహజసిద్ధ నూనెను గానుగ పరికరంతో తయారు చేయాలని భావించాడు. శిక్షణ పొంది తన స్వగ్రామంలో ఎద్దు గానుగ (చెక్క గానుగ) యూనిట్‌ను నెలకొల్పాడు. ప్రారంభించి ఏడాదైనా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒకసారి ఈ యూనిట్‌ను చూసి అభినందించి వ్యాపార అభివృద్ధికి రుణం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాజు యూనిట్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. వ్యాపార అభివృద్ధికి బ్యాంకు రుణం కావాలని రాజు కోరగా అప్పటికప్పుడు బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం అందించాలని కోరారు. అప్పటినుంచి ఎమ్మెల్యే గానుగ నూనెను తెప్పించుకుంటూ వాడుతున్నారు. రాజు అతడి భార్య అశ్విని ఇద్దరూ రోజుకు 20 లీటర్ల నూనె తయారు చేస్తూ భూపాలపల్లితో పాటు ఆర్టీసీ కార్గో ద్వారా వరంగల్, హనుమకొండ, గోదావరిఖని, ములుగు, ఏటూరునాగారం తదితర పట్టణాలకు రవాణా చేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
రసాయనాలతో ఆకర్షించే ప్యాకెట్లతో వచ్చే రిఫైన్ట్ ఆయిల్ మన ఆర్యోగానికి ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. కానీ ఒకప్పటిలా స్వచ్ఛమైన, సహజసిద్ధమైన నూనెలు దొరుకక అందుబాటులో ఉన్నవే వాడుతున్నారు. భూపాలపల్లికి చెందిన గిరిజన యువకుడు బౌతు రాజు సైతం స్వీయానుభవంతో కొత్త ఆలోచనకు తెరతీశాడు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల తండ్రి దూరమవడం, తన ఆరోగ్యమూ దెబ్బతినడంతో రిఫైన్డ్ ఆయిల్‌కు స్వస్తి చెప్పాడు. అందరికీ ఆరోగ్యం పంచాలనే సంకల్పంతో పూర్వకాలం నాటి గానుగ నూనెను పరిచయం చేశాడు. ఇందుకోసం అవసరమైన శిక్షణ తీసుకొని తన స్వగ్రామం ఆముదాలపల్లిలో చెక్క గానుక యూనిట్‌ను నెలకొల్పాడు. భార్య అశ్వినితో కలిసి పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఇప్ప నూనెలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేస్తున్నాడు. వీటిని ఇటు స్థానికులకు, దూరప్రాంతాల వారికి ఆర్టీసీ కార్గో ద్వారా చేరవేస్తున్నాడు. ఇలా అతడు ‘గానుగ నూనె’కు కేరాఫ్‌గా మారగా, అన్నిఖర్చులు పోను నెలకు రూ.30వేల వరకు ఆర్జిస్తున్నానని చెబుతున్నాడు. కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో అందరూ గానుగ నూనె రుచి కోసం ఉత్సాహం చూపుతుండగా, ఎద్దులతో నడిచే ఇలాంటి యూనిట్ ఉమ్మడి జిల్లాలో మొదటిది కావడం విశేషం.
ఆరోగ్యానికి ఎంతో మేలు
గానుగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మన పూర్వీకులే నిరూపించారు. గానుగ యూనిట్‌పై తయారు చేసే పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, విప్ప ఇలా ఒక్కో నూనెకు ఒక్కో ప్రత్యేకత ఉంది. నువ్వుల నూనెల ద్వారా క్యాల్షియం లభిస్తుందని, కుసుమ నూనెలతో చర్మవ్యాధులు నయమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు. చిన్న పిల్లల మసాజ్‌కు నువ్వుల, కుసుమ నూనెలను వాడుతుంటారు. ఈ సంప్రదాయ గానుగ నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేస్తారు. అందుకే వాటికి చక్కటి రుచి, సువాసనతో పాటు పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమెగా 6, ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లెవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. అయితే కరెంటు యంత్రం ద్వారా తయారయ్యే గానుగ నూనె యంత్రం వేడికి పోషకాలు హరించుకుపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. అందుకే సంప్రదాయ పద్ధతిలో చెక్క గానుగ ద్వారా తయారయ్యే నూనెలు ఆరోగ్యానికి మేలని చెబుతున్నారు.
రోజుకు 20 లీటర్ల నూనె తయారీ
గానుగ యూనిట్ ద్వారా రోజుకు 20 లీటర్ల నూనెలను తయారు చేస్తున్నారు. మూడు కిలోల పల్లీలతో ఒక లీటరు పల్లి నూనె, మూడు కిలోల నువ్వులతో ఒక లీటరు నువ్వుల నూనె, రెండు కిలోల కొబ్బరితో ఒక లీటరు కొబ్బరి నూనె, మూడున్నర కిలోల కుసుమలతో ఒక లీటరు కుసుమ నూనె, రెండున్నర విప్ప పరకలతో ఒక లీటరు విప్ప నూనె తయారవుతుందని రాజు చెబుతున్నాడు. ఒక లీటరు పల్లి నూనెకు రూ.420, ఒక లీటరు నువ్వుల నూనెకు రూ.620, ఒక లీటరు కొబ్బరి నూనెకు రూ.520, ఒక లీటరు కుసుమ నూనెకు రూ.550, ఒక లీటరు విప్ప నూనెకు రూ.500 తీసుకుంటున్నారు. రోజుకు 20 లీటర్ల నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. అన్నీ ఖర్చులు పోను రోజుకు రూ. 1000 మిగులుతున్నాయని రాజు తెలిపాడు. నూనెలను ప్రత్యేక టిన్లలో ఆర్టీసీ కార్గోలో రవాణా చేస్తున్నారు. నూనె తయారీ తర్వాత వచ్చే వ్యర్థాలను సైతం విక్రయిస్తున్నారు.
తయారీపై ప్రత్యేక శిక్షణ
గానుగ నూనె తయారీపై రాజు ప్రత్యేక శిక్షణ పొందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జక్లపల్లి గ్రామంలో 15రోజుల పాటు గానుగ నూనె తయారీ, యూనిట్‌పై ఏయే నూనెలు తయారు చేస్తారు, గానుగ యంత్రం(కరెంటు మిషనరీ)తో చేసే నూనెలు, ఎద్దు గానుగ యూనిట్‌తో చేసే నూనెలకు తేడా.. ఎద్దుగానుగ నూనెలో పోషకాలు, నూనెల మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత తన గ్రామంలో ఎద్దు గానుగ యూనిట్ నెలకొల్పాడు. ఆర్థిక స్థోమత లేక సుమారు 3 లక్షల వరకు అప్పు తెచ్చాడు. చిత్తూరుకు చెందిన కోదండచారి ని తీసుకువచ్చి చెక్క గానుగ పరికరాన్ని తయారు చేయించాడు. వరంగల్, కర్ణాటక, జహీరాబాద్‌ల నుంచి నూనెలకు కావాల్సిన ముడిసరుకు(రసాయన రహిత) తెచ్చి గానుగ నూనె తయారీని ఏడాది క్రితం ప్రారంభించాడు
ఎమ్మెల్యే గండ్ర సహకారం మరువలేనిది ;- బౌతు రాజు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారం మరువలేనిది. సార్ మా గానుగ యూనిట్ వద్దకు వచ్చి చూసి అభినందించి ప్రోత్సహించారు. రూ.10 లక్షలు బ్యాంకు నుంచి రుణం కావాలని అడిగిన. సార్ వెంటనే బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. రుణం మంజూరైతై పెద్ద షెడ్డు నిర్మాణం చేసి మరో గానుగ యూనిట్‌ను ఏర్పాటు చేస్తా. ప్రజలకు గానుగ నూనెను మరింత చేరువ చేస్తా. భూపాలపల్లి పట్టణంలో యూనిట్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడిన పని. ఎడ్ల మేతకూ ఇబ్బందే. అందుకే నేను ఉంటున్న ఊరు ఆముదాలపల్లిలోనే ఏర్పాటు చేసుకున్నా. కలుషిత వాతావరణానికి దూరంగా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నాకు బీపీ వ్యాధి ఉండె. మందులు వాడేవాణ్ణి. ఇప్పుడు గానుగ నూనె వాడుతున్నా. బీపీ కంట్రోల్ అయింది. మందులు బంద్ చేసిన. బయట దొరికే కల్తీ నూనెలు మానేసి గానుగ నూనె వాడితే ఎలాంటి రోగాలు రావు. సింగరేణి అధికారులు కూడా నూనెలు తీసుకెళ్తున్నరు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేస్తా. ఫోన్ చేస్తే ఎక్కడికైనా ఆర్టీసీ కార్గోలో పంపిస్తున్నా. ఈ నూనె ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. ఆయిల్ తీసిన తర్వాత వచ్చే వ్యర్ధాలు పశువుల దాణాగా, పంటల్లో సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతాయి. చాలా మంది ఈ వ్యర్థాలను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు.