హనుమకొండ చౌరస్తా/స్టేషన్‌ఘన్‌పూర్/కేసముద్రం ఆగస్టు 20 : రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పోరుబాట పట్టారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసేలా జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వరంగల్, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వరంగల్‌లో మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాసర్ మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి ములుగురోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ములుగురోడ్ జంక్షన్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. జీవో 97 ద్వారా శక్తి పథకాన్ని రద్దు చేసి, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం చేయాలన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిషారం కోసం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వినయ్ భాసర్ను అరెస్టు చేసి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కి తరలించగా, సొంత పూచికత్పై విడుదల చేశారు.
విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన నిర్వహించగా ఆయనతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. రాజయ్య మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సాంకేతిక విద్యను అభ్యసించి ఉపాధి పొందాలనే లక్ష్యంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం తగదన్నారు. జీవో 97ను వెంటనే రద్దు చేయకుంటే పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, నాయకులు పార్శి రంగారావు, చల్లా రఘురెడ్డి, శీలం శ్యాం, గట్టు కృష్ణసాయి పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ప్రధాన సెంటర్లు, ప్రభుత్వ కళాశాలల ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు సర్కారు పోలీసులను ఉపయోగిస్తున్నది. ఈ క్రమంలో కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద, ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల నుంచి విద్యార్థులు బయటకు రాకుండా గేట్ల వద్ద సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో పోలీసుల బలగాలను మోహరించారు.