దేవరుప్పుల, జూలై 4 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో నెలకొల్పిన తెలంగాణ విగ్రహానికి రాజకీయ రంగు పులిమారు. బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింత రవి ఈ విగ్రహం ఏర్పాటుచేయడమే తప్పుగా భావించిన కాంగ్రెస్ నాయకులు దీనిని కూలగొట్టాలనే కుట్రకు తెరలేపారు. అనుమతి లేదంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ విగ్రహాన్ని గురువారం సాయంత్రం గ్రామపంచాయతీ సిబ్బందితో తొలగించబోయారు. ఇంతలోనే మహిళలు తెలంగాణ తల్లి అందరిదని, దీనిపై రాజకీయం చేయడం తగదని, కూలగొట్టడం ఆపాలని గొడవ చేయడం, మరోవైపు రాత్రి కావడంతో అధికారులు వెనుతిరిగారు.
ఉత్సాహం చూపిన అధికారులు
తెలంగాణతల్లి విగ్రహ నిర్మాణానికి అనుమతి లేదనే నెపంతో కూలగొట్టేందుకు అధికారులు ఉత్సాహం ప్రదర్శించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎస్సై చెన్నకేశవులు, ఎంపీవో సురేశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి అంజలి, ఇతర గ్రామాల కార్యదర్శులు జీపీ సిబ్బందిని పురమాయించి విగ్రహాన్ని కూలగొట్టేందుకు ఉపక్రమించారు. స్థ్ధానిక ప్రజలు తిరగబడడంతో పనులు ఆపి వెనుతిరిగారు. ఒక మూలకు ప్రభుత్వ స్ధలంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని కూల్చివేత వెనుక రాజకీయం ఉందని, పెద్ద తలకాయల ఒత్తిడి తమపై ఉండడంతో ఈ పనికి పూనుకున్నట్లు పేరు చెప్పుకోలేని అధికారులు తెలిపారు.
రెండేళ్ల క్రితం నిర్మించిన గద్దె..
రెండేండ్ల క్రితం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఈ గద్దెను చింత రవి నిర్మించగా, కాలనీకి చెందిన కొందరు వ్యతిరేకించడంతో ఆ విగ్రహాన్ని కామారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన నెలకొల్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి ఆర్థిక సహాయం అందించి ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సీ కాలనీలో నిర్మించిన గద్దె వృథాగా ఉంటోంది. దీనికి గులాబీ రంగు వేసిన రవి ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాతల సహాయంతో ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. దీంతో గద్దెతో పాటు తెలంగాణ తల్లికి కప్పిన గులాబీ రంగు బట్టను సైతం మార్చాడు. అయినప్పటికీ మళ్లీ కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులు విగ్రహాన్ని కూలగొట్టాలనే పట్టుబట్టారు. కాగా, గ్రామాల్లో నెలకొల్పిన ఏ విగ్రహానికి, ఏ పార్టీ జెండా గద్దెలకు అనుమతి ఉందని, తెలంగాణ తల్లి విగ్రహం కూల్చాలని చూస్తే తాము ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.