సుబేదారి, నవంబర్ 23: శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మానవ హక్కులను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల సంక్షోభ సమయంలో- మానవహక్కుల పరిరక్షణ అంశంపై బుధవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులకు చర్చా పోటీలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా సీపీ హాజరై మాట్లాడుతూ మానవ హక్కులను పరిక్షించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతగా పని చేయాలని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోటీలకు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ప్రతాప్‌కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేస్తారు.