గీసుగొండ, అక్టోబర్ 25 : తెలంగాణ ప్రభుత్వం కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని శాయంపేట టెక్స్టైల్ పార్కులో జరుగుతున్న వాటర్ ట్యాంకు పనులు, పార్కులో భూములు కోల్పోయిన కుటుంబాలకు కేటాయించిన భూమి, విద్యుత్ సబ్‌ష్టేషన్ నిర్మాణ పనులను ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో గణేశా ఈకో టెక్, ఈకో పెట్ పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, మరో రెండు కంపెనీలు భవన నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఇందు కోసం భారీగా నిధులను కేటాయించి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు పార్కులోనే స్థలం కేటాయించామన్నారు. త్వరలో లే అవుట్ ప్లాట్లు చేసి వారికి అందజేస్తామన్నారు. నీటి సౌకర్యం కోసం పైపులైన్ పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నదన్నారు. అలాగే, గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ స్తంభంపల్లి గ్రామానికి లాకిడె రామారావు అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలిరాజయ్య, సర్పంచ్‌లు పూండ్రు జైపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, నాగదేవత, ఎంపీటీసీ వీరారావు, మండలాధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు సుంకరి శివ, చిన్ని, సంపత్, శ్రీకాంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.