బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలనిస్తున్నది. తప్పిపోయిన, భిక్షాటన చేసే, ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే పిల్లలను గుర్తించి రక్షణ కల్పిస్తూ వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్నది. హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు 1608 మంది చిన్నారులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించగా, వీరిని పనిలో పెట్టుకున్న 58 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ఈ నెల 31 వరకు కొనసాగనుండగా, బాలల గుర్తింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
హనుమకొండ, జూలై 13 : పిల్లలు బడిలో ఉండాలి… పెద్దలు పనిలో ఉండాలి.. అపుడే బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతాయి. నిరక్ష్యరాస్యత, పేదరికం, అవగాహనలేమితో తల్లిదండ్రులు పిల్లల చిన్నతనం నుంచే పనిలో పెడుతుండడంతో బాల్యం బందీ అవుతున్నది. తోటి వారితో ఆడుతూ పాడుతూ పాఠశాలలకు వెళ్లాల్సిన పిల్లలు ప్రమాదకర ప్రదేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. దీంతో వారి భవిష్యత్తును అంధకారమవుతున్నది. బలుపం, పెన్ను పట్టాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు.. బాల కార్మిక వ్యవస్థను ఎలాగైనా నిర్మూలించాలనే లక్ష్యంతో బాలల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేసి ప్రతి జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నది. తప్పిపోయిన, భిక్షాటన, ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే పిల్లలను బాలకార్మికులను గుర్తించి రక్షణ కల్పించడంతో పాటు వారి మోముల్లో చిరునవ్వులు చిందేలా చేసే ప్రయత్నమే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముసాన్. జిల్లాలోని పోలీస్, కార్మిక, ఫ్యాక్టరీ తదితర శాఖల సమన్వయంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ -1098 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, ప్రజల్లో చైతన్యం పెరుగడంతో బాలకార్మికులు, వీధి బాలలు తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు 1608 మందికి విముక్తి
2015 సంవత్సరం నుంచి దశల వారీగా కొనసాగుతున్న కార్యక్రమం ద్వారా ఎంతో మంది బాల కార్మికులు, బంధిత బాలలు, తప్పి పోయిన, భిక్షాటన చేసే పిల్లలకు విముక్తి కల్పించారు. తెలంగాణ పోలీస్, చైల్డ్ అండ్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో దర్పణ్ యాప్ ద్వారా మిస్సింగ్ చిల్డ్రన్ ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాల పునర్విభజన అనంతరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముసాన్ కార్యక్రమాల ద్వారా 2017 నుంచి 2023 వరకు 1,427 మంది బాలురు, 181 మంది బాలికలు కలిపి మొత్తం 1,608 మంది బాల కార్మికులను విముక్తులను చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 58 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక బృందాల ద్వారా…
ఈసారి నిర్వహించే ఆపరేషన్ ముసాన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి కాజీపేట, హనుమకొండ, పరకాల డివిజన్స్‌గా విభజించారు. ఒక్కొక్క డివిజన్‌కు ఒక ఎస్సై, ఒక లేబర్ ఆఫీసర్, చైల్డ్ లైన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధితో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ఒక యూనిట్‌గా ఏర్పడి మూడు సబ్ డివిజన్లను ఒకో యూనిట్‌గా స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేస్తున్నవారితో పాటు ఫ్యాక్టరీలు, కిరాణం షాపులు, హోటళ్లు తదితర వ్యాపార సంస్థల్లో వెట్టి చాకిరి చేస్తున్న బాలలను గుర్తిస్తున్నారు. గుర్తించిన వారిని బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. యజమానులపై కేసులు నమోదు చేస్తారు.
ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాన్
ఈ నెల 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుంది. బడికి వెళ్లాల్సిన పిల్లలు పనులకు వెళ్లే ప్రాంతాలను గుర్తిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. గుర్తించిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తాం. తర్వాత వారు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుసుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫోన్లో ఫాలోఅప్ చేయడంతో పాటు స్థానికంగా గుర్తించబడిన పిల్లల విద్యా ఆర్థిక అవసరాలను గుర్తించి సహకారం అందించడానికి చర్యలు తీసుకొంటున్నాం.
మధురిమ, జిల్లా సంక్షేమాధికారి, హనుమకొండ
యజమానులపై కేసు నమోదు చేశాం
జిల్లాలో హనుమకొండ, కాజీపేట్, పరకాల, మామునూరు డివిజన్లలో ఆపరేషన్ ముసాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. 14-18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యూలేషన్, జువెనైల్ జస్టిస్, మినిమం వేజెస్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తాం.
-పీ సంతోష్ కుమార్, డీసీపీవో, హనుమకొండ
బాలల పరిరక్షణే ధ్యేయం
బాలల పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలోని సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. బాల కార్మిక రహిత జిల్లాగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. 18 సంవత్సరాలలోపు బాల బాలికలను ఎవరూ పనిలో పెట్టుకోకుండా యజమానులతో సమావేశాలు నిర్వహిస్తాం. సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల ఎదుట బాల కార్మికులు లేరు అని తెలిపేలా బోర్డ్‌లు, ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఏ అనిల్ చందర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్, హనుమకొండ