వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తేతెలంగాణ): వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు బుధవారం నుంచి మే 30వ తేదీ వరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. డివిజన్ వారీగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు లబ్ధిదారులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి నన్నపునేని వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మైక్రోలెవల్కు తీసుకెళ్లేలా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా నేటి నుంచి 17 వరకు ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను 250 నుంచి 300 వరకు ఆహ్వానించేందుకు బొట్టు పెట్టే కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి 24 వరకు ఆయా డివిజన్లో ఆహ్వాన పత్రికలను నేరుగా అందజేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై 18 నుంచి 24వ తేదీ వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో తాను సమావేశాలు నిర్వహిస్తానని, పార్టీ కార్యకర్తలను గౌరవించటమే ముఖ్య ఉద్దేశమన్నారు. పైలట్‌గా ఈ నెల 25న రెండు వేల మందితో 35వ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ఇతర 23 డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయని, కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పిస్తామన్నారు. సమన్వయం కోసం డివిజన్ ఇన్చార్జిలను నియమించామని, కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 25 వరకు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో జెండా గద్దెలు నిర్మించడం, ప్రస్తుతం ఉన్న గద్దెలను పునర్నిర్మిస్తామన్నారు. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అగ్రభాగాన బీఆర్ఎస్
తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ను అగ్రభాగాన నిలుపుతామని ఎమ్మెల్యే నరేందర్ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడడమే తమ లక్ష్యమని, పార్టీ కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. క్రమశిక్షణకు తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మారుపేరని, రాజకీయంగా ఇక్కడ అందరం ఐక్యతగా ఉంటున్నట్లు వెల్లడించారు. రూ. 3,800 కోట్లతో తూర్పు నియోజకవర్గం అన్ని అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. లేబర్ కార్డులను ఇప్పించేందుకు మే 7న నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కార్మికులు, కార్మిక అనుబంధ సంఘాల సభ్యులతో సమీక్షిస్తామన్నారు. 8న డివిజన్ వారీగా కార్మికుల సభ్యత్వం, లేబర్ కార్డు ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. మే 9 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్ సభ్యత్వాలు చేయిస్తామని, మే 13 నుంచి 29 వరకు మిగతా 23 డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగేలా ప్లాన్ చేశామన్నారు. నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల మంది కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లేబర్‌కార్డు కోసం ప్రతి కార్మికుడు చెల్లించాల్సిన రూ. 110 తమ తండ్రి పేర ఉన్న ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రతి డివిజన్లో మీ సేవ కేంద్రం
గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించడంలో భాగంగా జీవో 58, 59 అమలుపై నియోజకవర్గంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుడిసెవాసులందరూ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా ఒక మీసేవ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 13 నుంచి ఇవి పని చేస్తాయని వెల్లడించారు. నియోజకవర్గం నుంచి సుమారు 8 వేల దరఖాస్తులు రాబోతున్నాయని, ఈ దరఖాస్తుదారులు ఒక్కొకరు చెల్లించాల్సిన రూ. 45 తానే చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఇక్కడ జీవో 58, 59 అమలుపై కలెక్టర్‌తో సమీక్షించినట్లు తెలిపారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగే 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తూర్పు నియోజకవర్గం నుంచి 300 మంది హాజరు కానున్నారని, వీరి కోసం ఆరు ఆర్టీసీ బస్సులను సమకూర్చుతున్నట్లు నన్నపునేని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కే జనార్దన్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సిద్దం రాజు, పోశాల పద్మ, కవిత, సీహెచ్ అనిల్, బీ సురేశ్, ఎస్ ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, పల్లం రవి, బీఆర్ఎస్ నేతలు సందీప్, పీ విజయ్‌కుమార్, గోపన్న పాల్గొన్నారు.