లింగాలఘనపురం; నవంబర్ 8: ‘హరిహరి నారాయణా.. ఆది నారాయణా’ అంటూ గళం విప్పి ఒగ్గు కథను దేశ నలుమూలలకు చాటిన చౌదరపెల్లి సత్తయ్య(చుక్క) నిజంగా మాణిక్యపురానికి మాణిక్యమేనని గ్రామస్తులు కొనియాడుతున్నారు. పేద కుటుంబమైన చౌదరపెల్లి సాయమ్మ-ఆగయ్య దంపతులకు 1931లో సత్తయ్య జన్మించాడు. 15వ ఏటనే కళారంగంలో అడుగుపెట్టి తొలుత ఆంజనేయస్వామి వేషధారణతో అరంగేట్రం చేశాడు. తర్వాత అల్లిరాణి(బృహన్నల) పాత్రలో నటించిన సత్తయ్య ఒగ్గు కళవైపు తన దృష్టిని మరల్చాడు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మాజీ సీఎంలు టంగుటూరి అంజయ్య, ఎన్టీ రామారావు ఎదుట తన కళను ప్రదర్శించి పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న ఒగ్గు కళకు జీవం పోసి ఒగ్గు కళాపితామహుడిగా పేరు పొందాడు. నేడు మాణిక్యపురం ఒగ్గు కళకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నది. వందలాది ఒగ్గు కళాకారులు దేశ విదేశాల్లో నిత్యనూతన ప్రదర్శనలిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. సత్తయ్యకు నుదిటి వెంట్రుకలపై ఉన్న తెల్లని మచ్చ వల్ల చుక్క సత్తయ్యగా పేరు పొందాడు. నేడు సత్తయ్య 8వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు జనగామలోని కళ్లెం జీడికల్ ప్రధాన తోరణ గేటు సమీపంలో సత్తయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.