సుబేదారి, సెప్టెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయనున్నారు. టెండర్ల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్ షాపులకు రెండేళ్ల గడువు వచ్చే డిసెంబర్‌తో ముగియనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ముందుగానే అంటే డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు షాపుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో మొత్తం 294 మద్యం దుకాణాలున్నాయి.
పాత పద్ధతిన రిజర్వేషన్లు
గత కేసీఆర్ ప్రభుత్వం మద్యం షాపులకు రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. గౌడ్స్‌కు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం షాపులు కేటాయించనున్నారు.
టెండర్ ఫీజు రూ. లక్ష పెంపు..
మద్యం షాపుల టెండర్ ఫీజును రాష్ట్ర ప్ర భుత్వం రూ. లక్ష పెంచింది. ఇంతకుముందు రూ. 2 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. రెండేళ్లకు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల వివరాలను వెల్లడించింది. 5వేల జనాభా ఉన్న షాపులకు రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలుంటే రూ. 55 లక్షలు, లక్షలోపుంటే రూ. 60 లక్షలు, 5 లక్షలలోపు జనాభా ఉన్న దుకాణాలకు రూ. 65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షలుంటే రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైన జనాభా ఉన్న షాపులకు రూ.1.10 కోట్లు ఆరు దఫాల్లో చెల్లించాలని పేర్కొంది.
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు
పాత వరంగల్ అర్బన్ (హనుమకొండ) :65
వరంగల్ రూరల్ (వరంగల్) :63
జనగామ :47
మహబూబాబాద్ :59
జయశంకర్ భూపాలపల్లి, ములుగు :60
మొత్తం :294