హనుమకొండ చౌరస్తా, మార్చి 13: చిన్న చేతులు పెద్ద సేవలు.. హనుమకొండ జిల్లా కిషన్పురలోని మాస్టర్జీ హైస్కూల్లో ఒక ప్రేరణాత్మక సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించే ఉద్దేశంతో మాస్టర్జీ హైస్కూల్ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభయహస్త ఫౌండేషన్ కోసం పెద్దమొత్తంలో నిధులను సేకరించారు. ఈ సేకరించిన నిధులను శుక్రవారం అభయహస్త ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఫండ్ సేకరణలో భాగమైన విద్యార్థుల సేవా భావాన్ని అభినందించారు. ఫండ్ సేకరించిన విద్యార్థులకు మమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి వారి సేవా స్పూర్తిని అభినందించారు. ముఖ్యంగా చిన్న వయసులోనే గణనీయమైన మొత్తాన్ని సేకరించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన మాస్టర్జీ హైస్కూల్ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కి, ప్రిన్సిపల్ రజిత, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ముఖ్యంగా, విద్యార్థులను మంచి మార్గంలో నడిపిస్తూ సేవాభావం కలిగించేలా ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఫౌండేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేయాలనే భావనను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం పెంపొందించడానికి మంచి ఉదాహరణగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.