వరంగల్ చౌరస్తా: వరంగల్లోని మట్వాడ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలు, దాడులకు పాల్పడుతున్నతున్న వ్యక్తిపై పోలీసులు రౌడీషీట్ (Rowdy Sheet) తెరిచారు. శుక్రవారం మట్వాడ సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ పరిధిలోని రంగంపేటకు చెందిన కుమ్మరి యాకుబ్ అలియాస్ భరత్(32) అనే వ్యక్తి మీద రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. అతనిపై ఇప్పటి వరకు 9 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వాటిలో ప్రజలపై దాడులు, లైంగికదాడులకు పాల్పడిన కేసులతోపాటు దోపిడీలు, దొంగతనాల కేసులు సైతం ఉన్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, దాడులు చేయడం, భయబ్రాంతులకు గురిచేయడం లాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.