ఫోన్ చేస్తే చాలు వాలిపోతాడు
కష్టాల్లోంచి పుట్టుకొచ్చిన ఐడియా
జీవనోపాధికి వినూత్న పంథా
రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగం.. మొబైల్ పంచర్ షాపు
హనుమకొండ సబర్బన్, మే 28 : అప్పటిదాకా మెయిన్ సెంటర్లో టైర్లకు పంచర్లు వేసుకుంటూ అతడి జీవితం సాఫీగా సాగింది. ఇంతలో రోడ్డు వెడల్పు పనుల్లో దుకాణం పోయి ఉపాధి కరువైంది. తనకు వచ్చింది.. చేయగలిగేది ఇదొక్క పనే. పంచర్లు అతకడం. కానీ ఏం చేయాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇంటి కిరాయి, ఖర్చులు ఎలా అంటూ మదనపడ్డాడు. బతుకు మీద ఆశలు సన్నగిల్లిన ఆ ప్రతికూల పరిస్థితుల్లో అతడికి ఒక ఆలోచన వచ్చింది. అదే సరికొత్త ఉపాధి మార్గం చూపింది. అదే మొబైల్ పంచర్ షాప్.
ఇన్నాళ్లు హసన్‌పర్తి అడ్డాగా పనిచేసిన మేకల ప్రసాద్.. ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ 9949707976 చేస్తే ఎక్కడికైనా వస్తాడు. బైక్, కార్లే కాదు.. లారీలు, టిప్పర్ల వంటి భారీ వాహనాలను పంచర్లు వేస్తాడు. ఉపాయం ఉన్నోడు ఎలాగైనా బతుకుతాడనేందుకు ప్రసాదే ఉదాహరణ.
మేకల ప్రసాద్‌ది హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి. 22 ఏండ్లుగా అక్కడే టైర్లకు పంచర్లు వేసే పనిలో స్థిరపడ్డాడు. అతడి ఊరు జాతీయ రహదారిపై ఉండడం వల్ల పంచర్ షాప్‌తో కుటుంబాన్ని ఉన్నంతలో బాగానే పోషించుకునేవాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న క్రమంలో రోడ్డు వెడల్పు పనుల్లో ప్రసాద్ తన దుకాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తనకు వచ్చిన పని ఇదొక్కటే కాబట్టి.. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కిరాయి రూములకు అడ్వాన్స్‌లు, వేలకు వేలు కిరాయిలు చెల్లించే స్థోమత అతడికి లేదు. దీంతో తనకు తెలిసిన విద్యకే మరింత పదును పెట్టాడు. తనకు వెల్డింగ్ చేసే పనిలో సైతం ప్రావీణ్యం ఉండడంతో ఒక పాత ఆటోను తీసుకుని దాన్ని తన పనికి అనుకూలంగా మార్చుకున్నాడు. దానికే జనరేటర్, ఇన్వర్టర్లను బిగించాడు. వాహనాల టైర్, ట్యూబ్‌ల్లో గాలి నింపేందుకు ఎయిర్ కంప్రెషర్‌ను కూడా అందులోనే ఏర్పాటుచేసుకున్నాడు. ఇక వాహన టైర్లను విప్పేందుకు, పంచర్ వేసేందుకు కావాల్సిన సామగ్రిని ఆటోలోనే ఉండేలా చేసుకున్నాడు. ఇప్పుడు మొబైల్ వాహనాల్లో తిరిగి విక్రయించే ట్రెండ్ నడుస్తోంది. అయితే వినూత్నంగా ఆలోచించిన ప్రసాద్ రాష్ట్రంలోనే తొలిసారి మొబైల్ పంచర్ షాపును ఏర్పాటుచేసి ఉపాయం ఉన్నోడు ఎక్కడైనా బతుకుతాడని నిరూపించాడు. ఆరేండ్ల క్రితం ప్రసాద్ మొదలుపెట్టిన ఈ మొబైల్ పంచర్ షాపు గురించి మెల్లిమెల్లిగా చుట్టుపక్కన గ్రామాల్లో పాకింది.
వందలాదిగా ఉండే ట్రాక్టర్ల యజమానుల వద్ద ప్రసాద్ ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఎక్కన్నుంచైనా, ఏ సమయంలో ఫోన్ వచ్చినా ప్రసాద్ తన వాహనంతో వాలిపోతాడు. పంచర్ అయిన చోటనే టైర్‌ను తీసి పంచర్ వేసి తిరిగి వాహనాన్ని ముందుకు నడిపించి గానీ రాడు. ఇప్పుడు కేవలం స్థానికుల వద్దనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రసాద్ ఫోన్ నంబర్ ఉంటుంది. 30, 40 కిలోమీటర్ల దూరమైనా వెళ్లి బాగుచేసి వస్తాడు. ఇదీ కాకుండా ఆయా ఫైనాన్స్ సంస్థలు రుణం చెల్లించని వాహనాలను సీజ్ చేసి తీసుకొస్తుంటారు. వాటిని షెడ్డుల్లో నెలల తరబడి ఉంచాల్సి వస్తుంది. వాటిని తిరిగి తీసేటప్పుడు పంచర్ కావడమో, ట్యూబ్‌లోంచి గాలి దిగిపోవడమో జరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రసాద్ సేవలను ఆయా ఫైనాన్స్ సంస్థలు వినియోగించుకుంటాయి. ఇవే కాకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు జరిగే చోట టిప్పర్ల టైర్ పంచర్లు అవుతుంటాయి. వాటి టైర్లు తీసి పంచర్ షాపు ఉన్న వద్దకు తీసుకువెళ్లి మళ్లీ బిగించి నడిపించాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అంతేకాదు పనులకు అంతరాయం కలుగుతుంది. ఇక్కడ ప్రసాద్‌కు ఫోన్ చేస్తే వెంటనే వర్క్ సైట్‌కు వెళ్లి పంచర్ వేసి సదరు టిప్పర్‌ను మళ్లీ పనిలో ఉండేలా చూస్తాడు. అయితే అక్కడక్కడ టూ వీలర్ టైర్లు పంచర్ అయితే అక్కడికి వెళ్లి పంచర్ వేసే దుకాణాలు ఉన్నాయి.. కానీ ఇలా పెద్ద పెద్ద లారీలు పంచర్ అయితే పంచర్ వేసే మొబైల్ షాపు మాత్రం ప్రసాద్‌దే కావడం విశేషం. 9949707976 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు ప్రసాద్ బండి స్టార్టయిపోతుంది.