Burqa Row : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని దోడా గవర్నమెంట్ ఆస్పత్రి (Doda Government Hospital) లో బురఖా (Burqa) వివాదం చెలరేగింది. లేబర్ రూమ్‌లోకి బురఖా ధరించిన తమను అనుమతించలేదని ఆరోపిస్తూ నర్సింగ్ ఇంటర్న్లు (Nursing Interns), విద్యార్థినులు (Students) ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. విచారణ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 30న కొందరు నర్సింగ్ విద్యార్థినులు బురఖా ధరించి విధులకు హాజరయ్యారు. అయితే గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మధు చిబ్.. వారిని లేబర్రూమ్లోకి అనుమతించలేదని ఆరోపిస్తున్నారు. బురఖా ధరించిన కారణంగా తమను లేబర్ రూమ్‌లోకి రానియ్యలేదని విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఆమె మాట్లాడారని ఆరోపించారు. దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వారు విధులను బహిష్కరించారు.
ఈ వివాదంపై ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇర్ఫాన్ తసద్దుఖ్ స్పందించారు. ఇది కేవలం పొరపాటున జరిగిన ఘటన అన్నారు. లేబర్ రూమ్ వంటి సున్నితమైన ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, వదులుగా ఉండే దుస్తులపై ఆస్పత్రి గౌను ధరించాలని మాత్రమే ప్రొఫెసర్ సూచించారని ఆయన వివరించారు. ఇదిలావుంటే విద్యార్థుల ఫిర్యాదుతో యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీ రెండు రోజుల్లో నివేదిక సమర్పించనుంది.