నెల్లికుదురు, నవంబర్ 1 :గురువుల చిట్టా ఇక అధునాతన చిప్‌లలో నిక్షిప్తం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గుర్తింపునివ్వడంతోపాటు అక్రమాలకు చెక్‌పెట్టేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీచర్లు తమ పూర్తి వివరాలతోపాటు ఫొటోలను ఆన్లైన్లో పొందుపర్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరోమారు ఆన్లైన్లో తమ వివరాలను సరిచూసుకొని సబ్మిడ్ చేస్తున్నారు. కాగా, టీచర్లకు గుర్తింపు కార్డులివ్వడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి.
విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పెంచేందుకు గతంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతోపాటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫొటోతోపాటు చిప్ ఉండే ఈ ప్రత్యేక కార్డులను సరికొత్త పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. మున్ముందు ఈ కార్డులే ఉపాధ్యాయులకు ప్రామాణికం కానున్నాయి. చిప్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులో ఉపాధ్యాయుల సమగ్రవివరాలు ఉంటాయి. ఉపాధ్యాయుడి పూర్తిపేరు, పుట్టిన ప్రాంతం, ప్రస్తుత నివాస ప్రాంతం, పుట్టిన తేదీ, వృత్తిలో చేరిన తేదీ, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, పాన్‌కార్డు నంబర్.. గతంలో ఎక్కడ పనిచేశారు…?, ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు…?, జీతభత్యాలు, హోదా తదితర వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.
కార్డుతో కలిగే ప్రయోజనాలు
పదోన్నతులు, బదిలీలతోపాటు ఇతర ప్రయోజనాల కోసం భవిష్యత్‌లో ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా పదోన్నతు లు, బదిలీల సమయంలో జరిగే కౌన్సెలింగ్‌లో సీనియార్టీ విషయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పడు జారీ చేసే కార్డుతో ఇలాంటి సమస్యలకు చెక్ పడనున్నది. ఆన్లైన్లో ఆటోమెటిక్‌గా సీనియార్టీ జాబితా జనరేట్ కావడంతో భవిష్యత్‌లో ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం అన్ని జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్‌లు ఉన్నాయి. ఉపాధ్యాయులకు జారీచేసే కార్డులను అందులో స్వైప్ చేస్తేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాల సేకరణ ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పూర్తి సమాచారాన్ని విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా ముందస్తుగానే సేకరించింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి ఏడాది ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నది. గతేడాది మాత్రం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడి ఫొటో, ఆధార్ నంబర్‌తోపాటు ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది. కార్డుల జారీ నేపథ్యంలో గతంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను సూరిచూసుకొని సబ్మిట్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లాశాఖకు ఉత్తర్వులు జారీ చేయగా, అన్ని జిల్లాల్లో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది.
కార్డుతో బహుళ ప్రయోజనాలు
బహుళ ప్రయోజనాలున్న ప్రత్యేక గుర్తింపు కార్డులను ఉపాధ్యాయులకు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ కార్డుల ద్వారా మున్ముందు ఉప్యాయులకు వృత్తిరీత్యా అన్ని రకాలుగా మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న సమాచారాన్ని మరోసారి సరిచూసుకోవాలని మండల విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చాం. జిల్లాలో 3770 మంది ఉపాధ్యాయులకుగాను 3750 మంది తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.