అందం, అభినయం ఉన్న కథానాయికలకు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆదరణ ఉంటున్నది. అలాంటివారిలో ఒకరు నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. తక్కువ సినిమాలే చేసినా, ఎక్కువ మంది
అభిమానులను సొంతం చేసుకున్నది. ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం ‘స్వయంభు’లో నిఖిల్‌తో జతకట్టింది. ఈ సందర్భంగా ఈ క్రేజీగర్ల్ పంచుకున్న కార్వాన్ కబుర్లివి.
నా జీవితంలో అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే యాక్సిడెంట్ జరిగింది. 2022లో జరిగిన ప్రమాదంలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. నా ప్రస్తుత ఫొటోల్లో ఆ గాయం కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది ఆ గాయాన్ని దాచుకొమ్మని సలహా ఇచ్చారు. దాన్ని దాచుకోవాల్సిన అవసరమేముందని నా అభిప్రాయం.
నేను పుట్టింది, పెరిగింది కర్ణాటకలోని శృంగేరిలోనే. పాఠశాల, కళాశాల స్థాయుల్లో పోటీలు నిర్వహించినప్పుడు నాట్యం చేయడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించేదాన్ని. ఉడుపిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాకు నటనంటే ఎంతో ఇష్టం. అందుకే జాతీయ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాలలో నటించడం ప్రారంభించాను.
ఈ ఎండాకాలం నాకెంతో ప్రత్యేకం. స్వయంభుతో పాటు నాగబంధం సినిమాలు విడుదల అవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన చిత్రాలివి. నాగబంధంలో పార్వతిగా, స్వయంభు చిత్రంలో క్లాసికల్ డ్యాన్సర్ సుందరవల్లిగా కనిపిస్తాను. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకోవడం వల్ల ఇప్పుడు చాలా హెల్ప్ అయింది.
వరుసగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు గుర్తిస్తారనేది అపోహ. మంచి సినిమాలు చేస్తేనే ఎక్కువ కాలం ఆదరణ ఉంటుందని నా అభిప్రాయం. సినీరంగంలో పోటీ గురించి అస్సలు ఆలోచించను. ఎవరి ప్రత్యేకత వారిది. మన పని మనం చేసుకుంటూ హాయిగా ముందుకు సాగడమే నాకు తెలిసినది. సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయం పక్కన పెడితే నా పాత్రకు నేను న్యాయం చేశానా లేదా అన్నదే నాకు ముఖ్యం.
యాక్సిడెంట్ తరువాత విశ్రాంతిలో ఉన్నప్పుడు పెయింటింగ్ నేర్చుకున్నాను. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మనసుకు కష్టంగా ఉన్నా లేదా జాలీగా ఉన్నా ఒక రెండు నెలలపాటు విదేశాలకు వెళుతుంటాను. అక్కడ నాకెంతో ఇష్టమైన పెయింటింగ్స్ వేస్తూ అలా గడిపేస్తుంటాను. ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. సమయానికి నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం నాకున్న అలవాట్లు. హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం.
అభిమానులతో ఎక్కువ సేపు గడపాలన్నది నా పాలసీ. అందుకే సోషల్ మీడియాలో అందరికి టచ్‌లో ఉంటాను. యాక్టింగ్ కెరీర్‌కు ఉపయోగపడే మార్గాల్లో సోషల్ మీడియా ఒకటిగా భావిస్తాను. ఇందులో కూడా మంచి, చెడూ సమానంగా ఉంటాయి. అందుకే ఎదుటివారికి అవకాశం ఇవ్వను. అతిగా వ్యవహరించను. అభిమానులతో వాదోపవాదాలకు తావు ఇవ్వకుండా, వారి అభిప్రాయాలకు గౌరవమిస్తాను.