కటిక పేదరికంలో పుట్టినా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి అతడిని ముందుకు నడిపించింది. బాల్యమంతా భారంగా సాగినా.. బడిఫీజులు కట్టలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నా.. చదువుపై మక్కువతో ఎలాగోలా ఎంబీఏ పూర్తిచేశాడు. చిన్న ఉద్యోగంలో చేరాడు.. అది కూడా సంతృప్తినివ్వలేదు. ఇక లాభం లేదనుకుని తనకు చిన్నప్పటి నుంచే పట్టుఉన్న పాటల రచన, నటనపై దృష్టిసారించి రాణిస్తున్నాడు కొమ్ములవంచ గ్రామానికి చెందిన వీరు. ఇప్పటికే పలు చిత్రాలకు పాటలు రాసి సినీ ప్రముఖుల మనన్నలు పొందాడు.
నర్సింహులపేట, నవంబర్ 1 :మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన గడ్డం యాలాద్రి, రంగమ్మ దంపతుల చిన్న కొడుకు వీరుది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కటిక పేదరికంలో పుట్టినా చదువుపై మక్కువతో చిన్నపాటి పార్ట్‌టైం జాబ్ చేస్తూ ఎంబీఏ పూర్తి చేశాడు. అయినా సరైన ఉద్యోగం రాక నిరాశచెందాడు. అప్పటికే అమ్మానాన్నలు ఒకరి వెంట మరొకరు మృతి చెందడంతో కుటుంబ భారాన్నంతా అన్న భుజాన వేసుకున్నాడు. ఆ తర్వాత వీరుకు పెళ్లి, భార్యాపిల్లలు వెంటవెంటనే జరిగిపోయాయి. చేసే ఉద్యోగం సంతృప్తి నివ్వక మానేసి ఊరిలో ఎవరికీ తెలియకుండా పెయింటింగ్ పనులకు వెళ్తూ.. కుటుంబాన్ని సాకడం భారమై అనేక ఇబ్బందులు పడ్డాడు.
ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కాలనుకున్న వీరు తనకు చిన్నప్పటి నుంచే పట్టుఉన్న జానపద, సినిమా పాటల రచన, నటనపై దృష్టిసారించాడు. తోటి సేహ్నితుల సలహాలు, సహకారంతో ముందుకుసాగాడు.సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘అన్నమో రామచంద్రా అన్న రైతుల కల్లాల్లో ధాన్యరాశులు ఊరే.. దోపిడీ పాలైన హైదరాబాద్ ఇప్పుడు ఆకాశ హార్మ్యాల అంగడిగా మారే.. ఆగమాగమైన తెలంగాణ పల్లె అందంగా నవ్విది.. గులాబీ తీరే.. బోసిపోయిన నేల మెడలోన నేడు అబురంగా హరితహారాలు జూరే’ అంటూ రాసిన పాట వీరుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతోపాటు ‘మిలమిల చంద్రుని శోభల తారకరామ.. మసిమబ్బును చీల్చగ మెరుపై దూకిన ధీమా’ అంటూ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాసిన పాటను ఎంపీ సంతోశ్‌రావు విడుదల చేశారు. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం 75జన్మదినం సందర్భంగా ‘గా..మా..నీ.. గమగస.. మగస..గస.’ అంటూ రాసిన పాటను బాలసుబ్రహ్మణ్యం గొంతుతో సుకుమార్ పాడిన తీరు ఆకట్టుకున్నది.
ప్రశంసల పరంపర..
ఇండియన్ సెల్యూలాయిడ్, బాహుబలి రచయిత విజేంద్రప్రసాద్ మదర్స్ డే సందర్భంగా వీరు రాసిన పాట పాడించుకుని మెచ్చుకుని, రూ.10వేల చెక్కు అందించి ఆశీర్వదించాడు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ న్యూజెర్సీ వాళ్లు ఘంటసాల జయంతి సందర్భంగా మణిశర్మ, చంద్రబోస్‌తోపాటు వీరును ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జీవితంలో గొప్ప అనుభూతి అని తెలిపాడు వీరు. 2019లో జరిగిన అంతర్జాతీయ సాహితీ సదస్సు, ఆట వారితో ఆత్మీయ పురస్కారం.., 2019లో డల్లాస్ డ్రీమ్ వారితో తెలంగాణ నగార కళాసృజన బెస్టు లిరిక్ అవార్డు అందుకోవడం గర్వంగా చెప్పాడు. సినిమా పాటలు రాస్తున్న టాప్ ఐదుగురిలో ఒకరిగా ఎదిగి పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నదే నా కోరిక అని తెలిపాడు.
పాటల పూదోటలో..
యవ్వనం సినిమా పాటతో మొదలై కోమలి, ఒక క్రిమినల్, ప్రేమకథ, ఐస్‌క్రీమ్, అమీర్‌పేటలో, అమీర్‌పేట టు అమెరికా, అనగనగా అలా మొదలైయింది.., ఖననం, కెప్టెన్ రాణాప్రతాప్, భగత్‌సింగ్ నగర్, దోషం, లవ్ ఈజ్ నాని, కల్డ్, జోడి నర్సింహాపురం వంటి చిత్రాలకు పాటలు రాశాడు. దీంతోపాటు అమాయకుడు, మీనం, లవ్ ఈజ్ ద బ్లైండ్, డాక్టర్ బ్రహ్మి, దిప్రిప్ వంటి షార్ట్ ఫిలింలలో నటించాడు. పీవీఆర్ క్రియేషన్ పేరుతో యూట్యూబ్ చానల్ స్థాపించి మరుగున పడుతున్న జానపద గేయాలను ఆడియో, వీడియోల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు.