ఏటూరునాగారం, నవంబర్ 19 : ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా క్రీడాకారులను కోరారు. స్థానిక కుమ్రంభీం స్టేడియంలో ఐటీడీఏ జోనల్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలను బుధవారం ప్రారంభించారు. ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లోని ఎనిమిది డివిజన్లకు చెందిన సుమారు 1,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవో మాట్లాడుతూ క్రీడాకారులు మంచి ప్రతిభను చాటాలని, ఆటలు, చదువులోనూ పోటీతత్వం ఉంటే భవిష్యత్‌లో విజయం వైపు రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.క్రీడలను అధికారులు పర్యవేక్షిస్తూ విజయవంతంగా ముగించాలని సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ఇద్దరు క్రీడాకారులకు అస్వస్థత
క్రీడలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎండలో ఉదయం నుంచి ఉన్న ఇద్దరు క్రీడాకారులు మార్చ్ఫాస్ట్లో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముందుగా మహబూబాబాద్ జిల్లా గార్ల బాలికల ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జమున సొమ్మ సిల్లి పడిపోతున్నట్లు గుర్తించిన తోటి క్రీడాకారులు పట్టుకుని పక్కకు తీసుకవచ్చారు. ఎండ తీవ్రతకు లోనైన జమున వాంతులు చేసుకుంది. పీవో చిత్రమిశ్రా విద్యార్థిని వద్దకు చేరుకోని పరిస్థితిని తెలుసుకుని వైద్యులకు సూచనలు చేశారు. వైద్యులు నాగరాజు, సుమలత అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించగా కోలుకుంది.
ఇదే సమయంలో మంగపేట మండలం చుంచుపల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రేణుక కూడా సొమ్మసిల్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. అయితే ఉదయమే ప్రారంభించాల్సిన క్రీడలను ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించడంతో ఉదయం నుంచి ఎండలోనే ఉన్న ఇద్దరు క్రీడాకారులు అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, ఏవో రాజ్‌కుమార్, ఐటీడీవో అజయ్‌కుమార్, ఈఈ వీరభద్రం, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, కిష్టు, శ్యామలత, వజ్జ నారాయణ, కొమ్మాలు, పీడీ దేవర భాస్కర్, ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ బల్గూరి వేణు, మల్లయ్య, లక్ష్మీనారాయణ, సతీశ్, సమ్మయ్య, సుమారు వంద మంది వరకు పీఈటీలు పాల్గొన్నారు.