జయశంకర్ భూపాలపల్లి. ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) :పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఆర్భాటం చేసి ఆచరణలో మాత్రం చతికిల పడింది. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల క్రితం 4,165 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 319 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 3,846 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 1,023 ఇండ్లు ప్రాథమిక దశలో ఉండగా, 594 ఇండ్లకు మార్కింగ్ చేసి వదిలేశారు. 1,148 ఇండ్లు ఆర్సీ స్టేజీలో, 465 ఇండ్లు రూఫ్ దశలో ఉన్నాయి. కాగా, అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన తాము బిల్లులు రాకపోవడంతో కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల ముడుపులిస్తే గానీ బిల్లులు ఇవ్వమని అధికారులు చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో మొరపెట్టుకుంటున్నా జిల్లా అధికారులు సైతం పట్టించుకోవడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
మా ఇల్లు 2023లో కాలిపోయింది. ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న డబ్బులు మంటల్లో బూడిదైనయ్.. కట్టుబట్టలతో రోడ్డున పడినం. ఈ రందికి నా భర్త చనిపోయిండు. 2025 జూలై 28న నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ముగ్గు పోసుకొని పిల్లర్లు లేపిన. రూ. 4 లక్షల వరకు ఖర్చయింది. అప్పుడే మా అత్త చనిపోవడంతో రెండు నెలలు ఇంటి పని ఆగింది. తర్వాత బిల్లు ఇస్తే పని మొదలు పెడతానని అధికారుల వద్దకు వెళ్తే ఇల్లు డిలీట్ అయిందని చెప్పిండ్రు. దీంతో అన్ని రకాలుగా నష్టపోయిన. నాకు దిక్కు తోస్తలేదు. కలెక్టర్‌ను కూడా కలిసిన. నాకు న్యాయం చేయాలె..
– చింతనిప్పుల రాజమణి, శాంతినగర్, చిట్యాల
జిల్లాలో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లు 319 మాత్ర మే. 4,165 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఆచరణలో సాధ్యం కావడం లేదు. భూ పాలపల్లి నియోజకవర్గంలో 3,106 ఇండ్లకు 303 మాత్రమే పూర్తయ్యాయి. అంటే గ్రామానికి రెండు, మూడు చొప్పున నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. అలాగే మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 1,05 9 ఇండ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 16 మాత్రమే పూర్తయ్యాయి. కాటారంలో 4, మహదేవపూర్‌లో 6, మల్హర్‌లో 5, పలిమెలలో ఒక ఇల్లు పూర్తిచేసి డబ్బా కొట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాకు ఇల్లు లేదు. 20 ఏండ్లుగా కిరాయికే ఉంటున్న. ఇల్లు మంజూరు చేయమని కలెక్టర్, ఎమ్మెల్యే సార్ల సుట్టు తిరిగిన. ఇక గ్రామ కార్యదర్శి దగ్గరకు పోతే వెయ్యి రూపాయలు అడిగిండు. అవి ఇచ్చినా కూడా ఇంకా రూ. 50 వేలు కావాలట. అవి ఇస్తే ఇల్లు ఇత్తదట. ఈ ముచ్చట కలెక్టర్ సార్‌కు చెప్పి, కాయితంపై రాసిచ్చిన. ఎవరూ పట్టించుకుంట లేరు. అన్ని పైసలు ఎక్కడి నుంచి తేవాలె? మీకు దండం పెడుత.. ఇల్లు ఇప్పియ్యండి. నా కొడుక్కు పెండ్లి కాలేదు. ఉండడానికి ఇల్లు లేదు. నాకున్న ఎవుసం భూమి వేరేటోల్లు రాయించుకున్నరు. కలెక్టర్ సారుకు చెప్పినా పట్టించుకుంటలేరు.
– గడ్డం రాజమ్మ, రేగొండ