కాజీపేట, సెప్టెంబర్ 14: దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజు గురువారం భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము వరకు జరిగిన సంధల్ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, యువ పీఠాధిపతి భక్తియార్ బియాబానీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, కులమత భేదాలు లేకుండా వేలాదిమంది భక్తులు దర్గాను దర్శించుకుని సర్వమత ప్రార్థనలు చేసి, చాదర్ కప్పి భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. దర్గాకు వచ్చిన ముస్లిం మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఖురాన్ పఠనం చేశారు. దేశంలోని వివిధ దర్గాల మత పెద్దలు బియాబానీ దర్గాను సందర్శించి పీఠాధిపతి ఖుస్రూపాషాను ఆశీర్వదించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, మత పెద్దలు కవ్వాలి, భజన కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు, వసతులు కల్పించింది. హనుమకొండ డీఎంహెచ్‌వో ఆదేశానుసారం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది దర్గా వద్ద వైద్య సేవలు అందిస్తున్నారు. వరంగల్ సీపీ డాక్టర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో సెంట్రల్ జోన్ డీసీపీ బారి నేతృత్వంలో కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్ పర్యవేక్షణలో సీఐ సార్ల రాజు బందోబస్తు చేపట్టారు. ట్రాపిక్ సీఐ సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఉత్సవాలకు వచ్చిన వారిలో తప్పిపోయిన పిల్లలను పోలీస్ హెల్ప్‌లైన్ డెస్క్ కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అప్పగించారు.
దర్గాకు చేరుకున్న ఫకీర్లు..
బియాబానీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఫకీర్ల విన్యాసాలు జరుగనున్నాయి. ఇప్పటికే బియాబానీ దర్గా ఉత్సవాల్లో విన్యాసాలు చేసేందుకు సుమారు 80 మంది ఫకీర్లు చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ఫకీర్ల విన్యాలు నేడు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం చివరిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై, ప్రత్యేక ప్రార్థనలు చేసే అవకాశం ఉందని పీఠాధిపతి ఖుస్రూపాషా తెలిపారు.
దర్గాలో చీఫ్‌విప్ ప్రత్యేక ప్రార్థనలు
బియాబానీ దర్గాను గురువారం రాత్రి ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిలాఫ్, చాదర్‌ను ఆయన స్వయంగా తీసుకురావడంతో దర్గా పఠాధిపతి ఖుస్రూపాషా, వివిధ దర్గాలకు చెందిన పీఠాధిపతులు, మతపెద్దలు స్వాగతం పలికారు. అనంతరం బియాబానీ సమాధికి ఫూల్ చాదర్‌ను సమర్చించి, ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చీఫ్‌విప్ మాట్లాడుతూ బియాబానీ దర్గాను కులమతాలకతీతంగా దర్శించుకోవడం మతసామర్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన బియాబానీ దర్గా ఉత్సవాలకు భవిష్యత్‌లో ఏటా క్యాంపు కార్యాలయం నుంచి గిలాప్, చాదర్‌ను సమర్పిస్తామన్నారు. బియాబానీ దయతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, బీఆర్ఎస్ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా పట్టం కట్టాలని ప్రార్థనలు చేసినట్లు దాస్యం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ్ చైర్మన్ యూసూఫ్ జహింద్ సాహెబ్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్, కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మైనార్టీ సభ్యుడు దర్శన్‌సింగ్, యువ పీఠాధిపతి భక్తియార్ బియాబానీ, బీఆర్ఎస్ నాయకులు మహ్మద్ సోనీ, నజీరుద్దీన్, నహీముద్దీన్, నయిం జుబేర్, మహమూద్, ఫయాజ్ పాల్గొన్నారు. అలాగే, బియాబానీ దర్గాను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కూడా దర్శించుకున్నారు.
దర్గా పరమ పవిత్రమైనది..
కులమతాలకతీతంగా దర్శించునే బియాబానీ దర్గా ఒక్కటే. ఈ దర్గా పరమ పవిత్రమైనది కావడంతో దాదాపు నాలున్నర దశాబ్దాలుగా కుటుంబ సమ్మేతంగా ఏటా క్రమంతప్పకుండా దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దర్గా విశిష్టత పెరుగడం వల్లే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. బతికినంతకాలం బియాబానీ దర్గాను దర్శించుకుంటూనే ఉంటా.
– ఆరీఫ్ ఖాన్, మాజీ సైనికాధికారి, హైదరాబాద్
మా కష్టాలు తీరాయి
బియాబానీ దర్గాను దర్శించుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిస్తున్నది. మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తెలిసిన వారి ద్వారా బియాబానీ దర్గాను దర్శించుకున్నాం. అప్పటి నుంచి మా కష్టాలు, కన్నీళ్లు తొలిగిపోయాయి. దీంతో ఏటా ఉత్సవాల్లో పాల్గొంటూ దర్గాను దర్శించుకుంటున్నాం.
– అబ్దుల్ రెహమాన్, సనత్‌నగర్
సౌకర్యాలు భేష్
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సహాయ సహకారాలతో బియాబానీ దర్గా పరిపరాల్లో చేసిన సౌకర్యాలు బాగున్నాయి. గతంలో కన్నా ప్రస్తుతం అధికారులు మంచి వసతులు కల్పించారు. పోలీసులు అన్ని విధాలా అప్రమ్తతంగా ఉంటూ పూర్తి సహకారాలు అందిస్తున్నారు.
– ఫారాన్, సికింద్రాబాద్