సంగెం/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/గీసుగొండ, డిసెంబర్ 23: రైతు దినోత్సవాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను సన్మానించారు. ఇందులో భాగంగా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్‌యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏవో సీహెచ్ యాకయ్య సేంద్రియ ఎరువు తయారీపై రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల అధిక దిగుబడి సాధించొచ్చన్నారు. అనంతరం నాచురల్ ఫార్మర్ అనిత, మహిళా రైతు కేతమ్మను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, రైతు నాయకులు కృష్ణారావు, ప్రొఫెసర్ వీరస్వామి, కిరణ్, జ్యోతి, మురళీధర్, రాజు, కార్యదర్శి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని మాదన్నపేట, ముత్తోజిపేట, లక్నేపల్లి, గురిజాలలోని రైతు వేదిక భవనాల్లో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్, సింధూ కిరణ్మయి మాట్లాడారు. చెన్నారావుపేటలో రైతు కందికట్ట మల్లారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) మండల నాయకుడు జన్ను రమేశ్ మాట్లాడుతూ రైతులు దేశానికి గర్వకారణమన్నారు. అన్నదాతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో కంది పూలమ్మ, ఇంద్ర, కోరె కోమల, దేవమ్మ తదితరులు ఉన్నారు. గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నదని తెలిపారు.
పత్తి పంట పరిశీలన
గీసుగొండ మండలంలోని విశ్వనాథపురం, నందనాయక్తండాలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం పత్తి పంటను పరిశీలించింది. శాస్త్రవేత్త తిరుమల్‌రావు మాట్లాడుతూ యాసంగి పత్తి పంటకు కూడా గులాబీ రంగు పురుగు బెడద అధికంగా ఉంటుందన్నారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తికి గిట్టుబాటు ధర లభిస్తున్నందున రైతులు పంట రక్షణపై దృష్టి సారించాలనిక సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త అనిల్‌కుమార్, ఏవో హరిప్రసాద్‌బాబు, ఏఈవోలు విజయ్‌నాయక్, రజిని, అబిద్హుస్సేన్, కావ్య పాల్గొన్నారు.