జనగామ రూరల్, ఏప్రిల్ 1 : ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో కాంగ్రెస్ సర్కారు నేటి నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాలకు పైసా ఇవ్వకుండా ఆర్భాటపు ప్రచారం చేస్తున్నదనే విమర్శలు వెలువడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె, పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాలకు కోట్లాడి రూపాయలు విడుదల చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలకే తప్ప గ్రామాలకు నిధులు విడుదల చేయడంలేదని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామసభల పేరిట శానిటేషన్, ఫైల్స్ క్లియరెన్స్, ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ వాట్సాప్, ఇన్స్టాగ్రాం, సోషల్ మీడియాలో ప్రచారాలతోనే సరిపెడుతున్నారని వాపోతున్నారు. రాష్ట్రంలోని కలెక్టర్లతో గత నెల 3న సీఎం సమావేశం నిర్వహించి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక చేపట్టారు. ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం చేపడితే తమ గ్రామాలు కొద్దోగొప్పో బాగుపడుతాయని అంతా భావించారు. కానీ కార్యక్రమం ప్రారంభమైందే తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
పల్లెలు, పట్టణాల్లో ప్రస్తుతమున్న సిబ్బందితో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఇప్పటికే చేసిన అభివృ ద్ధి పనులకు సర్కారు నిధులు విడుదల చేయకపోగా, మరోసారి నేటి (గురువారం) నుంచి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేర గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నా రు. జీపీల నిధులను వీటికి వాడుకోవచ్చనే అదేశాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి సీఎం ప్రసంగం వినిపించడం, వచ్చే వారందరికీ కుర్చీలు, టెంట్లు వేసి చాయ్ బిస్కెట్లు ఇవ్వాలంటే భారీగా ఖర్చవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
వీటికయ్యే ఖర్చు ఎక్కడి నుంచి తేవాలని చర్చించుకుంటున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిని అమలు చేయకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు. దీనిపై గ్రామసభల్లో ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని అధికారులు, అధికార పార్టీ సర్పంచులు జంకుతున్నారు. ఇకనైనా గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, లేకుంటే గ్రామసభల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.