కొత్తపాతల మేళవింపు పనులతో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్క వానకాలం పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతుండగా, మరోపక్క యాసంగి సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడంతోపాటు పొలాలకు నీళ్లు పెట్టి నానబెడుతున్నారు. వరికొయ్యలను మురిగించి కలియదున్నుతున్నారు. ట్రాక్టర్లతో దమ్ముకొడుతూ వరినాట్లకు పొలంమడులను సిద్ధం చేస్తున్నారు.
ఇక వానకాలంకు సంబంధించి దాదాపుగా వరికోతలు ముగిశాయి. కొందరు రైతులు ధాన్యాన్ని కల్లాలు, రోడ్లకు ఇరువైపులా ఆరబెట్ట్టుకోగా, మరికొందరు బస్తాల్లో నింపుకొని సంతోషంగా తీసుకెళ్తున్నారు. పుట్ల కొద్దీపండిన వడ్ల రాశులతో పల్లెలు పునీతమవుతుండగా, ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇండ్లకు చేరుతుండడంతో కర్షకులు మురిసిపోతున్నారు.