హనుమకొండ సబర్బన్, మార్చి 27 : దేవాదుల ఎత్తిపోతల పథకం మూడోదశ మోటర్లు నడిచే విషయమై వారం రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 5.57 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా గతంలో కేసీఆర్ నిర్మించి చివరి దశకు తీసుకొచ్చిన మూడో దశ మోటర్లను నడిపించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఇంజినీర్లు ఒక మోటరును నడిపించారు. దీంతో కొంతమేర ఊరట లభించినప్పటికీ ప్రస్థుత పరిస్థితిల్లో ఇవి ఏ మాత్రం సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.
ఈసారి ఓఅండ్ఎం కార్మికులకు వేతనాలు ఇవ్వని కారణంగా 37 రోజుల పాటు దేవాదుల నుంచి నీటి పంపింగ్ నిలిచిపోయింది. దీనికితోడు దేవన్నపేట పంప్‌హౌస్ పనులు ఎప్పుడో పూర్తయినప్పటికీ మోటర్ల ట్రయల్న్ నిర్వహించలేదు. పైగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, ట్రయల్న్ లేకుండానే ఈ నెల 18న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పంప్‌హౌస్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం మోటర్లను ఆన్ చేయగా అవి మొరాయించాయి.
దీంతో ఎంత రాత్రయినా మోటర్లను ఆన్ చేస్తామని ప్రకటించిన మంత్రులు అక్కడే మకాం వేశారు. అయితే పంపులు ఆన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో చివరకు వెళ్లిపోయారు. ఆస్ట్రియా నుంచి ప్రొటోకాల్ ఇంజినీర్ రావాలని చెప్పిన నీటి పారుదల శాఖ అధికారులు అతడు వచ్చి మూడు రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు నీటిని ఇవ్వలేకపోయారు. స్కాడా సిస్టం ద్వారా పంపులు ఆన్ చేసేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల మోటర్లు ఆన్ కాలేదు.
దీంతో మళ్లీ మొదటి నుంచి కమిషనింగ్ చేస్తూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు తెల్లవారుజామున ఒక పంపును ఆన్ చేసి సుమారు నాలుగు గంటల పాటు ట్రయల్ రన్ చేశారు. దీంతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వస్తున్న సమాచారంతో ఇంజినీర్లు మోటర్‌ను నిలిపివేశారు. హుటాహుటిన దేవన్నపేట పంప్‌హౌస్‌కు మంత్రులు చేరుకున్న అనంతరం మళ్లీ మోటర్లు ఆన్కాకుండా మొరాయించాయి.
దాదాపు 40 నిమిషాల పాటు శ్రమించిన ఇంజినీర్లు ఒక మోటర్‌ను ఆన్ చేశారు. ప్రస్తుతం నడిపిస్తున్న మోటర్ ద్వారా నిత్యం 16.8 క్యూసెక్కుల నీరు ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతుంది. రామప్ప చెరువు నుంచి నేరుగా టన్నెల్ ద్వారా వచ్చే నీటిని ధర్మసాగర్లోకి తరలించనున్నారు. రామప్పలో ప్రస్తుతం 207 మీటర్ల నీటి మట్టం ఉండగా అందులో మూడు మీటర్ల నీటిని తోడుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గోదావరి జలాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం కావడంతో పంటలు చేతికొచ్చుడు మాత్రం అనుమానాస్పదంగానే ఉంది.