వరంగల్, ఆగస్టు 11 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అంటేనే ఇతర ప్రాంతాల ఉద్యోగులు వణికిపోతున్నారు. బదిలీపై ఇక్కడకు రావడానికి ససేమిరా అంటున్నారు. బల్దియా నుంచి పైరవీలు చేసుకుని మరీ బదిలీపై వెళ్లిన వారు ఎక్కువగా ఉండగా, బల్దియాకు రావడానికి మాత్రం ఇతర ప్రాంతాల ఉద్యోగులు జంకుతున్నారు. గ్రేటర్ కార్పొరేషన్లో పనిచేయడానికి ఉద్యోగులు భయపడుతున్నారు.
రాజకీయ నేతల ఒత్తిడులు, పని భారం తట్టుకోలేక వెళ్లిపోతున్న వారు ఎక్కువగా ఉంటే, రావడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ఈ కృష్ణారావు పైరవీ చేసుకుని మరీ జీహెచ్ఎంసీకి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇక్కడకు మరెవ్వరు రాలేదు. దీంతో ఈఈకి ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బదిలీల్లో భాగంగా ప్రజారోగ్య విభాగంలో 8 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. 23 విలీన గ్రామాలను కలుపుకొని 407.71 చదరపు అడుగుల విస్తీర్ణం, 10 లక్షలకు పైగా జనాభా, 66 డివిజన్లతో ఉన్న గ్రేటర్ కార్పొరేషన్‌లోని ఒక కీలక విభాగంలో ఒకేసారి 8 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు బదిలీ అయినా ఇతర ప్రాంతాల నుంచి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒక్కరు కూడా వరంగల్ కార్పొరేషన్‌కు ఆప్షన్ పెట్టుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం 317 జీవోలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న నలుగురితోపాటు మరో ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్రమే ప్రజారోగ్య విభాగంలో ఉన్నారు.
బల్దియా ఎస్ఈ కృష్ణారావు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మరెవ్వరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. వరంగల్ కార్పొరేషన్‌కు రావడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బల్దియా ఉద్యోగులే చెబుతున్నారు. అయితే, ఎస్ఈ కృష్ణారావు బదిలీల జాబితాలో లేకున్నప్పటికీ ఆయన పైరవీ చేసుకుని మరీ వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తవారు రాకపోవడంతో ప్రస్తుతం ఈఈగా ఉన్న రాజయ్య కు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఒక్కో శానిటరీ ఇన్స్పెక్టర్ 6 నుంచి 7 డివిజన్ల బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన విభాగం ప్రజారోగ్య విభాగం. తెల్లవారు జాము నుంచి కార్మికులు విధుల్లో చేరి నగరాన్ని శభ్రం చేసే పనిలో ఉంటారు. కార్మికుల హాజరు, చెత్త తరలింపు, రోడ్ల పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను శానిటరీ ఇన్స్పెక్టర్లు చేస్తుంటారు. గతంలో ఒక్కో శానిటరీ ఇన్స్పెక్టర్కు 3 నుంచి 4 డివిజన్లు ఉండేవి. ప్రస్తుత బదిలీల నేపథ్యంలో 7 డివిజన్ల వరకు చూడాల్సి వస్తోంది. నగరంలో ఎక్కడ చెత్త తీస్తున్నారో పర్యవేక్షించడం వీరికి కష్టంగా మారింది. దీంతో నగర పారిశుధ్య వ్యవస్థ పడకేసే అవకాశాలు ఉన్నాయి.