వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 26 : గోవిందరాజుల గుట్ట అభివృద్ధికి కృషి చేస్తానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 27వ డివిజన్లో పర్యటించారు. గోవిందరాజుల గుట్టను ఆనుకొని ఉన్న వాటర్ ట్యాంకు, దేవాలయ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో గుట్టను ఆధ్మాత్మిక కేంద్రం, సీటీ వ్యూ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మైదానాల్లో వసతులు..
పోచమ్మమైదాన్ : దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303 గవర్నర్‌గా చింతం సారంగపాణితో పాటు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కమిటీ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. తడక కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. సీకేఎం కళాశాల గ్రౌండ్, ఓ సిటీ గ్రౌండ్, ఉర్సు గుట్ట గ్రౌండ్, శంభునిపేట గ్రౌండ్లో వాకర్స్ కోసం ప్రత్యేకంగా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల కోసం టాయిలెట్స్, ఇతర వసతులను సమకూర్చుతామని పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్పీ రవీంద్ర మాట్లాడుతూ.. నడవండి, నడిపించండి అనే నినాదంతో వాకర్స్ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ కో ఆర్డినేటర్ దేశిని లక్ష్మీనారాయణ, ఎలెక్టెడ్ గవర్నర్ పచ్చిమల్ల ఎల్లాగౌడ్, క్యాబినెట్ సెక్రటరీ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్ భారతి, పాస్ట్ గవర్నర్ నాగభూషణం, కృష్ణకుమారి, విజయలక్ష్మి, ఇంటర్నేషనల్ సెక్రటరీ ద్వారకానాథ్, శరత్‌కుమార్ పాల్గొన్నారు.
లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు..
పోచమ్మమైదాన్ : వరంగల్ డాక్టర్స్ కాలనీ-1, గౌతమీనగర్‌లోని దత్తాత్రేయ సహిత లక్ష్మి గణపతి దేవాలయంలో 20వ వార్షికోత్సవ పూజా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యే నన్నపునేని పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి, ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. కాగా, ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రా రంభమయ్యాయి. సుప్రభాత సేవ, నిత్య అర్చన, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షా బంధనం, ధ్వజారోహణం, పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ కావటి కవిత, అర్చకుడు సూరంపూడి ఫణికుమార శర్మ, భక్తులు పాల్గొన్నారు.
శ్మశానవాటిక పనులు త్వరలోనే పూర్తి..
గిర్మాజీపేట : అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని ప్రగతిశీల్ మర్వాడీ వారి శ్మశానవాటికను త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. స్థానిక నేతలతో కలిసి శ్మశానవాటిక పరిసరాలను పరిశీలించారు. అలాగే, 26వ డివిజన్లో రోడ్డు వెడల్పు పనుల గురిం చి స్థానికులతో మాట్లాడారు. డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేశ్ పాల్గొన్నారు.