ఖిలావరంగల్, అక్టోబర్ 27 : కాకతీయుల కళా రాజధాని ఓరుగల్లులో వారసత్వ సంపద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆచార వ్యవహారాల మార్పిడి.. సంస్కృతుల సుసంపన్నత.. కాలగర్భంలో కలిసిపోయిన అనేక గాథలను మనకు అందించే వారసత్వ శాఖ ప్రదర్శనశాలపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. పాత రాతియుగం నుంచి మొదలు నేటి వరకు నవ సమాజ అవసరాల కోసం మానవ జాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపదను భద్రపరుస్తూ ప్రజలకు విజ్ఞానం, వినోదం కోసం దోహదపడే వస్తు ప్రదర్శనశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ మహానగర పాలకసంస్థ కార్యాలయం వెనక ఉన్న వారసత్వ శాఖ మ్యూజియ భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు 1200పైగా శిల్పాలు, శాసనాలు, నాణేలు, కత్తులు, డాల్లు ఔరా అనిపించే శిల్పసంపద కలిగి ఉన్న మ్యూజియం వర్షానికి కురుస్తున్నది. దీంతో ఉద్యోగులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియానికి వెళ్లేందుకు సరియైన దారి కూడా లేకపోవడంతో నెల మొత్తం 10 మంది పర్యాటకులు కూడా రావడం లేదు.
ప్రస్తుతం ఉన్న మ్యూజియాన్ని కోటకు తరలించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుచ్చేందుకు గత ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో మ్యూజియం భవన నిర్మాణానికి ఐదు సార్లు వేర్వేరు చోట్ల శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేశారు. అయితే, పనులు మాత్రం చేపట్టలేదు. తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2015లో రూ.3.80కోట్లు నిధులు కేటాయించింది. పనులు కూడా దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మిగిలి పనులు అలాగే ఆగిపోయాయి. మిగిలిన పనులతోపాటు ప్రస్తుత మ్యూజియం నుంచి సంపదను తరలించేందుకు ఇంకా రూ.3 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఎవరూ పట్టించుకోకపోవడంతోపాటు కనీసం భవనాన్ని పర్యవేక్షించకపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. నూతన భవనం పాడుబడిన బంగ్లా మాదిరిగా కనిపిస్తున్నది. చుట్టూ ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారిందని స్థానికులు చెబుతున్నారు. చెత్తాచెదారం పేరుకుపోయి, నూతన భవనం అంధవికారంగా కనిపిస్తున్నదని, అలాగే భవనం గోడలకు అక్కడక్కడా పగుళ్లు వచ్చాయి. ప్రహరీ కూలిపోవడంతో పునర్నిర్మానం చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా పాత మ్యూజియాన్ని తరలించకపోవడం, కొత్త భవనాన్ని పూర్తి చేయకపోవడం వల్ల చరిత్రకారులు, పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.