హనుమకొండ, మార్చి 23 : సుప్రీం కోర్టు తీర్పు మేరకు అజాంజాహి మిల్లు కార్మికులు 318 మంది స్థలాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే డే వరకు గడువు ఇస్తున్నామని, లేనిపక్షంలో కార్మికులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అజాంజాహి మిల్లు కార్మిక సంఘ నాయకులు, కార్మికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల ముందు మిల్లు కార్మికులు ఎకడ కోరితే అకడ స్థలం ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చాడని, ఎన్నికల అనంతరం వారిని మోసం చేశాడని ఆరోపించారు. కార్మికులంతా చందాలు వేసుకొని కార్మిక భవన్‌ను నిర్మించుకున్నారని, అప్పటి నుంచి ధరణి, రిజిస్ట్రేషన్, విద్యుత్ బిల్లు, జీడబ్ల్యూఎంసీ ప్రాపర్టీ టాక్స్‌లో ఉందన్నారు.
కార్మిక భవన్ సర్వే నంబర్‌ను 93 నుంచి 90కి మార్చి గొట్టిముకల నరేశ్‌రెడ్డి అనే వ్యక్తికి అప్పగించారన్నారు. 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి వరంగల్ తహసీల్దార్ ద్వారా సర్వే నంబర్ మార్చడంతో పాటు జీడబ్ల్యూఎంసీ అనుమతి తీసుకున్నారన్నారు. కార్మిక భవన్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసే హకు మాత్రమే తహసీల్దార్‌కు ఉంటుందని, ఇంటి నంబర్‌తో కాదన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ ఉన్న భవనాన్ని మ్యుటేషన్ చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని, కార్మిక భవన్ స్థలాన్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. కొండా మురళి ప్రైవేట్ వ్యక్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టింది, సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్మిక భవన్ భూమిని మ్యుటేషన్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే అజాంజాహి మిల్లు మూతపడిందన్నారు. ఆనాడు 451మంది కార్మికులుంటే 131 మందికి స్థలాలు ఇచ్చారని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు మిగిలిన 318 మందికి కూడా స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన ఊపిరి ఉన్నంత వరకు కార్మికుల పక్షాన పోరాటం చేస్తానని నన్నపునేని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మిగిలిన కార్మికులకు స్థలాలు అప్పగించాలని ఏజే మిల్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇనుముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి తాము తిరుగుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. మే డే వరకు చూస్తామని, అప్పటి వరకు న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడతామన్నారు. కార్మికులకు స్థలాలు ఎప్పుడో ఇచ్చామని, వారు అమ్ముకున్నారని మంత్రి కొండ సురేఖ అంటున్నారని, అసలు ఇచ్చిందెవరు? అమ్ముకున్నది ఎవరు? బయటకు తీయాలని యశోద డిమాండ్ చేశారు. సమావేశంలో మిల్లు కార్మికులు పాల్గొన్నారు.