వరంగల్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగర సమీపంలోని మామూనూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే నిబంధన రద్దయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (హెచ్ఏఐఎల్)ను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థతో ఒప్పందం అనంతరం ఈ నిర్ణయం జరిగిందని పేర్కొన్నది.
మామునూరు ఎయిర్‌పోర్టులో సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను తొలగించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల చర్చల అనంతరం జీఎంఆర్ సంస్థ నిబంధన సడలింపునకు అంగీకారం (ఎన్వోసీ) తెలిపింది. దీనిని ధ్రువీకరిస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్‌ఝా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు లేఖ రాశారు. తాజా నిర్ణయంతో మామునూరు విమానాశ్రయంలో సర్వీసుల పునరుద్ధనకు అవసరమైన పనులు చేపట్టనున్నారు.
ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మామునూరు ఎయిర్‌పోర్టును నిర్మించారు. 1930లో దీని కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజాం సర్కారులో వరంగల్ సుబేదార్ (ప్రాంతీయ కేంద్రం)గా ఉండగా అప్పుడు అజంజాహి టెక్స్టైల్ మిల్లును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి మామునూరు ఎయిర్‌పోర్టుకు వాయుదూత్ పేరుతో విమాన సర్వీసులు నడిచేవి. 1981 వరకు ఇక్కడ సర్వీసులు కొనసాగా యి. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఈ సేవలు నిలిచిపోయాయి.
ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ, అవసరమైన భూ సేకరణ కోసం 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ పొందించిన ప్రణాళికతో ఇప్పుడు కీలక నిర్ణయాలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నంతో 2022 లో కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధి లక్ష్యంగా 2023లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయు క్త బృందం ఏర్పాటు కాగా, పునరుద్ధరణకు అవసరమైన నిర్ణయాలు, నిధులు, భూసేకరణపై నివేదిక రూ పొందించింది.
రూ.592 కోట్లతో దీన్ని అమలు చేయాలని పేర్కొన్నది. మామునూరు ఎయిర్‌పోర్టుకు మొద టి నుంచి 696 ఎకరాల భూమి ఉండగా, మరో 253 ఎకరాల భూమి అవసరమవుతుందని సంయుక్త కమి టీ సూచించింది. ఈ మేరకు భూమి సేకరణ కోసం 2024 నవంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం మామునూరు ఎయిర్‌పోర్టులో 2.9 కిలోమీటర్ల పొడవుతో రన్‌వే విస్తరించనుండగా, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు జరుగనున్నాయి.