Mulugu | ఏటూరు నాగారం : అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ ఏటూరు నాగారం అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా పశువులను తరలిస్తూ.. అవి కనిపించకుండా కూరగాయల ట్రేలను అడ్డుపెట్టారు. ఏటూరు నాగారం చెక్ పోస్టు వద్ద అటవీశాఖ అధికారులను గమనించిన డీసీఎం డ్రైవర్ వేగం పెంచాడు. దీంతో అధికారులు పోలీసులు రెండు కిలోమీటర్ల మేర డీసీఎం వ్యాన్‌ను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు వెలుగు చూసింది.
దీంతో సదరు అటవీశాఖ సిబ్బంది, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వ్యాన్ స్వాధీనం చేసుకొని, పశువులను భూపాలపల్లిని గోశాలకు తరలించారు. స్వాధీనం చేసుకున్న డీసీఎంను పోలీసులకు అప్పగించినట్లు రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. వ్యాన్‌లో 28 పశువులు ఉన్నాయని వాటిని గోశాలకు తరలించినట్లు ఎస్సై రాజకుమార్ తెలిపారు. అక్రమంగా పశువుల రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా చర్ల ప్రాంతం నుంచి ఇదే తరహాలో పశువులను అక్రమంగా కట్టేసి నిబంధన విరుద్ధంగా తరలించారు.