పోచమ్మమైదాన్, అక్టోబర్ 14 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న బెడ్షీట్లు, కార్పెట్ల (కోన్ ఉత్పత్తులు)ను ఎట్టకేలకు కొనుగోలు చేశారు. నెలల తరబడి పేరుకుపోయిన ఉత్పత్తులకు మోక్షం లభించడంతో ఆయా చేనేత సహకార సంఘాల పర్సన్ ఇన్చార్జిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత జూలై 18న ‘కోన్ ఉత్పత్తులను కొనరట’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి టెస్కో అధికారులు స్పందించి కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో 34 వరకు చేనేత సహకార పారిశ్రామిక సంఘాలు, మరో 26 మాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి.
అయితే ఆయా సంఘాల్లో కోట్లాది రూపాయల కోన్ ఉత్పత్తుల నిల్వ పెరిగిపోవడంతో సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందారు. టెస్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ ఆదేశాల మేరకు ఆయా సంఘాల్లోని బెడ్షీట్లు, కార్పెట్ల కొనుగోళ్లను అధికారులు మంగళవారం ప్రారంభించారు. ఆయా సంఘాల్లోని 1.90 లక్షల బెడ్షీట్లు, 1.25 లక్షల కార్పెట్లకు స్టాంపింగ్ వేసి, బండిల్స్ కట్టామని, వీటి విలువ రూ. 7 కోట్ల వరకు ఉంటుందని టెస్కో డీఎంవో వెంకటేశ్వర్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.