పూల పూజకు వేళైంది. నేటి ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఉత్సవాలు అంబరాన్నంటనున్నాయి. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వీధులన్నీ హోరెత్తనున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు ఇష్టమైన వేడుక. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి దాకా రోజూ మహిళలు ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. పిల్లాజెల్లా.. గొడ్డుగోదా సల్లంగ ఉండాలని కోరుకుంటారు.
– కృష్ణకాలనీ, అక్టోబర్ 13
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలుస్తున్న బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. పల్లెదారులన్నీ పూల పరిమళాలు వెదజల్లుతాయి. రెండువైపులా పసుపు ఆరబోసినట్లు తంగేడు.. చేనుచెలకల్లోంచి నిక్కినిక్కి చూసే గునుగు, పట్టుకుచ్చు.. ముళ్ల కంచెల మీద నుంచి పలకరించే కట్ల పూలు.. ఇంటి గోడ మీద విరిసి మురిపించే మందారాలు, తలుపు సందుల్లోంచి తొంగి చూసే గన్నేరు.. నేలంతా పరుచుకుని, బంగారాన్ని విచ్చుకునే గుమ్మడి ఇంకా రుద్రాక్ష, గోరింట.. ఇలా తీరొక్క పువ్వు బతుకమ్మ పండుగను ఆహ్వానిస్తూ కనిపిస్తాయి. ఎంగిలిపూల నుంచే ఆడబిడ్డల సందడి మొదలవుతుంది.
ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల పూలను, వాటితో గౌరమ్మను పూజించడం ఈ పండుగలోని విశిష్టత. మెట్టినింటికి వెళ్లిన మహిళలంతా ప్రతి బతుకమ్మ పండుగకు పుట్టింటికి చేరుకుంటారు. తొమ్మిదిరోజులపాటు మమతానురాగాల బతుకమ్మలను పేర్చి, సంతానం, పాడీపంటా చల్లంగుండాలని ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని వెళ్తారు. తమకు మంచి భర్త దొరకాలని కన్నెపిల్లలు కోరుకుంటారు. కాగా నేడు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానుండగా, శుక్రవారం నుంచే సందడి నెలకొంది. మార్కెట్లన్నీ పూలగొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. కొత్తబట్టలు కొనుక్కునేవారితో వస్త్రదుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి.
స్వరాష్ట్రంలోనే గుర్తింపు
అందరూ సమష్టిగా జరుపుకొనే అందమైన, అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఇది తెలంగాణకే గర్వకారణం. బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆవిర్భావం తర్వాతే గుర్తింపు దక్కింది. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేపూల సంబురం బతుకమ్మను 2014 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలు నేడు ప్రారంభమై 22న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపుప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. చివరి రోజు అత్యంత ఘనంగా పండుగ జరుపుకొంటారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సందడి చేస్తారు. ఆడిపాడి బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒక్కరికొక్కరు వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.