ఖిలావరంగల్: పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొత్త పెన్షన్ పద్ధతి ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎసరుపెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో చేర్చి ఆకస్మాత్తుగా ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీన లోకసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారని తెలిపారు.
కొత్త పద్ధతి పెన్షన్ విధానాన్ని అడ్డుకోవాలని ఉద్దేశంతో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించిందని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి కి లేఖలు పంపేందుకు శ్రీకారం చుట్టినట్లు పెన్షనర్లు తెలిపారు. వేల సంఖ్యలో పెన్షనర్ల సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సత్య శారదకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు కే సుధీర్ బాబు, ఎన్ సదానందం, పెద్దయ్య, మనోహర్, వీరస్వామి, వీరయ్య, సాంబయ్య, ప్రకాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.