కేసీఆర్ అచ్చినంకనే కరెంటు మంచిగైంది..
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్‌తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల దగ్గర జాగారం చేయాల్సి వచ్చేది.
- సారు ఆలోచనతోనే పవర్ఫుల్ తెలంగాణ
- అంతకుముందు అచ్చీరానీ కరెంటుతో ఆగమైనం
- అప్రకటిత కోతలతో పొలాల దగ్గరే రాత్రంతా జాగారం
- బీఆర్ఎస్ సర్కారుతో వ్యవసాయానికి రంది లేదు
- 24గంటల నిరంతర విద్యుత్‌తో పుష్కలంగా పంటలు
- మునుపటి కంటే ఎక్కువ పండిస్తున్నం
- ఎన్నడూ ఒక్క గుంట కూడా ఎండిపోలే
- ఇప్పుడు కేసీఆర్‌ను బదనాం చేయడం తగదు
- స్వరాష్ర్టానికి ముందు, తర్వాత విద్యుత్ పరిస్థితిపై రైతుల మనోగతం
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్‌తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల దగ్గర జాగారం చేయాల్సి వచ్చేది. సాగునీళ్లు అందక పంటలు పండక ఎంతోమంది రైతులు అప్పులపాలై ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆరే. స్వరాష్ర్టాన్ని సాధించడమే గాక ముందుచూపుతో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయానికి రంది లేకుంట చేశిండు. ఆయన వచ్చినంకనే కరెంట్ మంచిగైంది’ అంటూ రైతాంగం స్పష్టంచేస్తోంది. తెలంగాణ రాకముందు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చి రంది లేకుండా చేశారని గుర్తుచేసుకున్నారు. ఇలా ఒక వ్యవసాయమే కాదు.. అన్ని రంగాలను గాడిన పెట్టి ‘పవర్ఫుల్ తెలంగాణ’గా నిలబెట్టిన కేసీఆర్‌ను.. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బదనాం చేయడం తగదని మండిపడుతున్నారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 19
గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కినం
హనుమకొండ సబర్బన్, జూన్ 19: 2014 కంటె ముందు వ్యవసాయ రంగానికి గడ్డు పరిస్థితులుండె. నాలాంటి వాళ్లెందరో కరెంటు కష్టాలతో దాన్ని వదిలి ఇతర పనులు చూసుకున్నరు. నేను కూడా అదే పని చేద్దామనుకున్న. గప్పుడే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ ముఖ్య మంత్రి అయ్యిండు. కొత్త రాష్ట్రం వచ్చింది గద చూద్దామనుకున్న. కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొని ఎవుసానికి 24గంటల విద్యుత్ ఇచ్చిండు. దీంతో అయిదెకరాల్లో వేసుకునే నాట్లు పదెకరాలకు పెంచుకోగలిగినం. ఒక్క గుంట కూడా ఎండకుండా పంటలు పండించినం. పిల్లల్ని మంచిగ సదివిచ్చుకున్నం. ఆనాడు ఆ కరెంటు కొనకుంటే తెలంగాణ వచ్చిన దానికి అర్థం ఉండేది కాదు. ఇప్పటి ప్రభుత్వం కేసీఆర్‌ను బద్నాం చేసుడు సరికాదు. గొడ్లెన్ని సచ్చినయనేది కాదు ముఖ్యం. వడ్లెన్ని పండినయనేది కూడా ముఖ్యమే.
– పొలాటి గోపాల్‌రావు, రైతు, ఎల్కతుర్తి
రాత్రిపూట బావుల కాడనే పండేది
రేగొండ, జూన్ 19 : 2014కు ముందు సాగునీటి కోసం బావుల వద్దనే పండేది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. వేళాపాల లేకుండా కోతలు ఉండేది. వచ్చిన కరెంట్ కూడా సక్రమంగా సరఫరా కాక మోటర్లు కాలిపోతుండె. కరెంట్ లేక, పంటలు చేతికిరాక అప్పులపాలై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నరు. ఎవుసం చెయ్యలేక ఊర్లు ఇడ్చిపెట్టి పట్టణాలకు వలసలు పోయి కూలీ పనులకు పోయినం. తెలంగాణ అచ్చినంక అప్పటి సీఎం కేసీఆర్ రైతు బాధలు తెలుసుకొని 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంతో ఏడాది పొడవునా మూడు పంటలు సాగు చేసినం. కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా రాత్రి పూట పంటలకు సాగునీరు పెట్టెటోళ్లం కాదు. పగటి పూటనే మోటర్లు అన్‌చేసి నిర్భయంగా ఉండెటోళ్లం. అసొంటి కేసీఆర్‌ను కాంగ్రెసోళ్లు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు చేసిండంటూ నిందించడం సరైంది కాదు. వాళ్లు ఇప్పడు అధికారంలోకి వచ్చినంక మళ్ల పాతరోజులు గుర్తుకు వస్తున్నయి. ఇప్పటికే ఎడాపెడా కోతలు విధిస్తున్నరు. కేసీఆర్ కన్నా కరెంటు మంచిగియ్యాల్సింది పోయి మాటలంటున్నరు.
– సామాల రాజిరెడ్డి, రైతు, రేగొండ
కరెంట్‌తో రాత్రంతా మేల్కొవాల్సి వస్తుంది
జనగామ చౌరస్తా : నా పేరు మంద రవి. నేను జనగామ మండలంలోని చౌడారం గ్రామంలో సొంతంగా మినీ రైస్ మిల్లును నడుపుతున్నాను. ఇంతకు ముందు 24 గంటల కరెంట్ ఉండేది. ఇప్పుడు రోజు అర్థరాత్రి 12 గంటలకు కరెంట్ వచ్చి మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆరు గంట లు కరెంట్ బంద్ చేస్తుండ్లు. దీంతో రైతు లు మిల్లుకు తీసుకొచ్చిన వడ్లను రోజుకి ఐదు వందల బస్తాలను పట్టే నేను ఇవాళ మూడు వందల బస్తాలే పట్టగలుగుతున్నాను. దీంతో ఆర్థికంగా కొంత నష్టపోవడంతో పాటు రాత్రంతా మే ల్కొనాల్సి వస్తున్నది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నయి.
– మంద రవి, మినీ రైస్‌మిల్ యజమాని, చౌడారం
కరెంటిచ్చిన కేసీఆర్‌ను తప్పు పట్టడం అన్యాయం
చెన్నారావుపేట, జూన్ 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌ను తప్పు పట్టడం నిజంగానే అన్యాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డమో ఇంకా గుర్తున్నది. నేను గత 14 ఏండ్లుగా చెన్నారావుపేట మండల కేంద్రంలో వెల్డింగ్ పని చేస్తున్న. పదేళ్లకు ముందు రోజులో 4 గంటలు మాత్రమే పని చేయడానికి కరెంట్ ఉండేది. అది రెండు దఫాలుగా వచ్చేది. మిగిలిన సమయమంతా ఖాళీగా కూసునేటోళ్లం. వచ్చీ రాని కరెంట్‌తో వెల్డింగ్ పని చేయలేక విసుగొచ్చేది. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట విద్యుత్ వ్యవస్థ రూపమే మారిపోయింది. ఏం చేసినా సరే జనాలకు మాత్రం 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కరెంట్ పోతదనే ఆలోచనే లేకుండా చేసిండు. అలాంటి కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడని నిలదీయడం దురదృష్టకరం. దూర దృష్టితో ఆలోచించి కేసీఆర్ రూపొందించిన విధానంతోనే తెలంగాణలో ఇప్పుడు కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది. కేసీఆర్‌పై కక్ష సాధింపు రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదు.
– వెంకటేశ్, వెల్డింగ్ షాప్, చెన్నారావుపేట
కరెంట్ ఇబ్బందులు లేకుండె..
నర్సింహులపేట, జూన్ 19 : యాసంగి పంటలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో గతేడాది మండుటెండలో సైతం చెరువు, కుంటల్లో నీరు నిండుగా ఉంది. దీనికి తోడు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశారు. ఇప్పుడు గాలివాన వచ్చిందంటే కరెంట్ పోతుంది. ఎప్పుడు వస్తుందో తెలువని పరిస్థితి నెలకొంది. గత యాసంగిలో కాల్వల ద్వారా సాగునీరు సక్రమంగా వదిలిపెట్టక పోవడంతో చెరువులు ఎండిపోయి నెర్రలు బారాయి. దీనికి తోడు 24 గంటల పాటు కరెంట్ ఇబ్బంది లేకుండా ఇచ్చిండ్రు. గత ఏడాది వానకాలంలో వేసిన మిరుప పంట బాగా దెబ్బ తిన్నది. మిరుప తీసేసి యాసంగి మక్కజొన్న, వరి పొలం సాగు చేసినం. నీళ్లు లేక పంటలు ఎండిపోయినయి. వారానికి ఒకసారి నీళ్లు వదిలి పెడితే కాలువ తడుసుడుకే సరిపోయింది. క్రేన్‌తో బావుల్లో లోతు తీసినం. అయినా నీళ్లు లేవు.
– అజ్మీరా శ్రీను, గోపతండా
గత ప్రభుత్వ కృషి ఫలితమే 24గంటల కరెంట్
గోవిందరావుపేట : గత కేసీఆర్ ప్రభుత్వ కృషితోనే 24 గంటల కరెంట్ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. ఈ కృషి వెనుక గత ప్రభుత్వ పట్టుదల ఎంతో ఉంది. తెలంగాణ రాక ముందు కరెంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి 24 గంటల కరెంట్‌ను చూసుడు కేసీఆర్‌తోనే సాధ్యమైంది.
– పున్నం అజయ్, మచ్చాపూర్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

