సుబేదారి, జూలై 2 : కిడ్నాప్ ముఠాలో ప్రధాన నిందితుడిగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తమ్ముడు ప్రదీప్‌రెడ్డి ఉండడం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. ఏసీపీ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ప్రదీప్‌రెడ్డిపై కేసు నమోదు కావడం, ఆయనతోపాటు ముఠా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కేయూ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ నయీం నగర్‌లోని పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌ను సునీల్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, సదానందం పార్ట్నర్ షిప్లో కొంతకాలంగా నిర్వహించారు. ఈక్రమంలో వారి మధ్య వివాదాలు రావడంతో సదానందం దాన్ని తీసుకొని, తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అకాడమీని పటిష్టం చేశాడు. ఇందులో ఎలాగైనా 50 శాతం వాటా దక్కించుకోవాలని సునీల్‌రెడ్డి సదానందంను బెదిరించి ఒప్పించడానికి తన దగ్గరి బంధువైన ప్రదీప్‌రెడ్డిని ఆశ్రయించారు.
సినీ ఫక్కీలో కిడ్నాప్
ప్రదీప్‌రెడ్డి, సునీల్‌రెడ్డి మరికొందరితో ముఠాగా ఏర్పడి సినీఫక్కీలో బుధవారం ఎర్రగట్టు గుట్ట -పరకాల రోడ్డులో సదానందంను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని ప్రదీప్‌రెడ్డి స్వగ్రామం కమలాపూర్ మండలం శనిగరానికి తీసుకువెళ్లారు. సదానందంను కొట్టి బాండ్పేపర్స్పై సంత కాలు తీసుకున్నారు. ఇదేకాకుండా ముఠా సభ్యుల్లో కొందరు సదానందం ఇంటికి వచ్చి అతడి భార్యతో బాండ్‌పేపర్స్ మీద సంతకాలు పెట్టించే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది.
రెండు రోజుల్లో నీ భార్యతో సంతకాలు పెట్టించాలని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కిడ్నాప్ ముఠా సదానందంను మధ్యాహ్నం వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పింగిళి ప్రదీప్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి గాలిస్తున్నామని కేయూ పోలీసులు తెలిపారు. కాగా ప్రధాన నిందితుడి ప్రదీప్ రెడ్డిపై సుబేదారి పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. ఈ కేసు విషయమై నమస్తేతెలంగాణ కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డిని వివరణ కోరే ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.