హనుమకొండ, నవంబర్ 12: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, బీసీల కుల గణన వంటి అంశాల అమలులో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావును మంగళవారం హైద రాబాద్‌లో కలిసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ భాసర్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ సమగ్ర సర్వేను స్వాగతి స్తూనే అందులోని కొన్ని ప్రశ్నలు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కులగణన పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీల అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించేలా చూడాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు అయ్యాయని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ పథకాల అమలు అయ్యేలా చొరవ చూపాలని కోరారు. మహాత్మా జ్యోతీరావు ఫూలే విదేశీ విద్యా నిధి అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా బృందం సభ్యులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.