నర్సంపేట, సెప్టెంబర్ 7: భారీ వర్షంతో నర్సంపేట డివిజన్లో జనజీవనం స్తంభించింది. తుఫాన్ ప్రభావంతో జలాశయాలు ఉప్పొంగాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నర్సంపేట-నెక్కొండ రహదారిలోని లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట-మహబూబాబాద్ రూట్లో రవాణా నిలిచిపోయింది. కొత్తగూడ మార్గానికి అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మాదన్నపేట వాగు మత్తడితో వట్టెవాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల ఈ నీరంతా ఎన్టీఆర్నగర్లోకి చేరింది. మార్కెట్ దగ్గర ఎస్సీకాలనీలోకి కూడా నీరు వచ్చింది. ఎన్టీఆర్నగర్లో రోడ్డుకు గండి పడుతుండడంతో స్థానికులు మరమ్మతులు చేశారు. నర్సంపేటలో 191.2 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 175.6 మి.మీ, నెక్కొండలో 100.2 మి.మీ, నల్లబెల్లిలో 258 మి.మీ, ఖానాపురంలో 227 మి.మీ, దుగ్గొండి మండలంలో 221 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గ్రామాలకు రాకపోకలు బంద్
నెక్కొండ: మండలంలో వర్షబీభత్సానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రధాన రహదారుల పైనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నెక్కొండలో వట్టెవాగు ఉధృతితో నెక్కొండ-నర్సంపేట, నెక్కొండ-గూడూరు రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ డీఎస్ వెంకన్న, డీఎస్పీ పుప్పాల తిరుమల్ ఆయా ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టారు. చంద్రుగొండ వద్ద వట్టెవాగు ఉధృతితో చంద్రుగొండ, గొల్లపల్లి, గేట్పల్లి, బంజరుపల్లికు రవాణా బంద్ అయింది. పెద్దకోర్పోలు-చిన్నకోర్పోలు గ్రామాల మధ్య, నాగారం-ఇంటికన్నె రోడ్డులో జనజీవనం స్తంభించింది. గుండ్రపల్లి చెరువు మత్తడి ఉధృతితో నెక్కొండ-గుండ్రపల్లి, మడిపెల్లి, పెద్దకోర్పోలుకు రాకపోకలు నిలిచిపోయాయి. దీక్షకుంట, ముదిగొండ గ్రామాల మధ్య, నెక్కొండ నుంచి పత్తిపాక గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. వట్టెవాగు పరివాహక ప్రాంతంలో పంటలు చేలు నీటమునిగాయి.
పంటపొలాల్లోకి చేరిన నీరు
దుగ్గొండి: మండలకేంద్రంలోని ఊరచెరువు, తిమ్మంపేట గుండం చెరువు మత్తడి దుంకుతుండడంతో పెద్దమ్మమాటు, గోపాలపురం లోలెవల్ కాజ్వే, నారాయణతండాకు వెళ్లే రహదారి, లక్ష్మీపురం ఆరు మోరీల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దుగ్గొండి నుంచి నల్లబెల్లి, దుగ్గొండి నుంచి ఆత్మకూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని 34 జీపీల్లో ఉన్న చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. నాయబ్ తాసిల్దార్ సౌజన్య, ఎస్సై నవీన్‌కుమార్, పీఎస్సై మహేందర్, ఎంపీడీవో కృష్ణప్రసాద్ చెరువులు, కాజ్‌వేలను పరిశీలించారు. కాగా, నల్లబెల్లి, ఆత్మకూరు, ములుగు మండలాలకు వెళ్లే ప్రయాణికులు కాజ్వే దాటే పరిస్థితి లేక ఇబ్బంది పడుతుండడంతో స్పందించిన ముద్దునూరు సర్పంచ్ రేవూరి సురేందర్‌రెడ్డి తన సొంత ట్రాక్టర్‌పై వారిని గమ్యస్థానాలకు చేర్చారు.
17.56 సెం.మీ వర్షపాతం
చెన్నారావుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మండలవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 17.56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెన్నారావుపేట, పాపయ్యపేట, లింగాపురం, ఉప్పరపల్లి, జల్లి, అమీనాబాద్, అక్కల్చెడలోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. తాసిల్దార్ ఫూల్సింగ్చౌహాన్, ఎంపీపీ బదావత్ విజేందర్ ప్రజలను అప్రమత్తం చేశారు. స్పెషలాఫీసర్ బాలకృష్ణ మంగళవారం మండలాన్ని సందర్శించారు. మండలకేంద్రంలోని బతుకమ్మ పాయింట్ వద్ద కోతకు గురైన రోడ్డుపై మట్టి పోయించాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద ఉన్న లోలెవెల్ పైనుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో ఎవరూ వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో దయాకర్, కార్యదర్శి బాలకిషన్‌గౌడ్, కానిస్టేబుల్ తిరుపతిగౌడ్ ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీటీడీవో
నల్లబెల్లి: మండలంలోని లోలెవల్ కాజ్‌వేల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల స్పెషలాధికారి, డీటీడీవో జహీరొద్దీన్ సూచించారు. ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్తో కలిసి ఆయన మండలంలో వర్షాభావ పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వివరాలను తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో ప్రకాశ్, ఐబీ డీఈ రవి, పీఆర్ ఏఈ రజినీకాంత్, ఆర్అండ్బీ ఏఈ సందీప్, పీఆర్ ఏఈ సంగీత, ఐబీ ఏఈ పవిత్ర, ఏవో పరమేశ్వర్, ఏఈవో సాధన ఉన్నారు.
జలాశయాల పరిశీలన
రాయపర్తి: మండలంలోని 39 గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నిండాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలను ఎస్సారెస్పీ, నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యల కోసం రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఊకల్, సన్నూరు, రాయపర్తి, మైలారం, కొండూరు, కాట్రపల్లి, తిర్మలాయపల్లిలోని చెరువుల కట్టలు, మత్తళ్ల తీరుతెన్నులను పరిశీలించారు. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో రిజర్వాయర్ స్పిల్ వే గేట్లతోపాటు అవుట్ ఫ్లో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎస్సారెస్పీ ఈఈ రమేశ్‌బాబు, డీఈ కిరణ్‌కుమార్, ఏఈలు బాలదాసు, సునీత, సిబ్బంది యాకయ్య, రాజు, నవీన్‌కుమార్ పాల్గొన్నారు. మైలారం గ్రామ పరిధిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను సర్పంచ్ లేతాకుల సుమతి యాదవరెడ్డి నేతృత్వంలో జీపీ సిబ్బంది మొరంతో పూడ్చి వేశారు. ఉప సర్పంచ్ సారయ్య, కార్యదర్శి సుమలత, కారోబార్ ఉప్పలయ్య పాల్గొన్నారు.
ఆకేరువాగు పరవళ్లు..
వర్ధన్నపేట: ఆకేరువాగు పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ ప్రాంతం నుంచి ఆకేరువాగులోకి వరదనీరు భారీగా చేరుతున్నది. దీంతో వాగుపై ఉన్న చెక్‌డ్యాంల నుంచి పెద్ద ఎత్తున నీరు తరలి వెళ్తున్నది. ఉప్పరపల్లి ఎల్లమ్మ చెరువులోకి ఐనవోలు మండలంలోని చెరువుల మత్తడి నీరు వస్తుండడంతో అలుగు పోస్తున్నది. పర్వతగిరికి వెళ్లే రహదారి పైనుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనదారులను అనుమతించలేదు.
రాకపోకలకు అంతరాయం
నర్సంపేట రూరల్: మాదన్నపేట పెద్ద చెరువు మంగళవారం 2 ఫీట్ల మందంతో మత్తడి పోస్తున్నది. అన్ని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మాదన్నపేట శివారులోని పంటలు పూర్తిగా నీట మునిగాయి. లోలెవల్ కాజ్వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. మాదన్నపేట, నాగుర్లపల్లి, దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, భోజ్యనాయక్‌తండా, రాంనగర్ రోడ్లలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని పలు గ్రామాల్లో లోలెవల్ కాజ్‌వేలపై ప్రవహిస్తున్న వరదనీటిని అదనపు కలెక్టర్ హరిసింగ్ పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో పవన్‌కుమార్, నర్సంపేట, చెన్నారావుపేట తాసిల్దార్లు రామ్మూర్తి, పూల్‌సింగ్‌చౌహాన్, ఐబీ డీఈ రాంప్రసాద్, నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ ఉన్నారు. అధనపు కలెక్టర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు తగిన సూచనలు చేశారు. పాతముగ్ధుంపురం లోలెవల్ కాజ్‌వేను ఏసీపీ కరుణసాగర్‌రెడ్డి పరిశీలించారు.