గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 19, 2021 , 02:49:22

ఇప్పుడంతా హై స్పీడ్‌!

ఇప్పుడంతా హై స్పీడ్‌!

  • అందరికీ అందుబాటులో ఇంటర్నెట్‌ 
  • వేగానికి ప్రాధాన్యమిస్తున్న నగరవాసులు
  • సిటీలో విస్తరిస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

హన్మకొండ చౌరస్తా :ఇప్పుడు ప్రపంచం అరచేతిలోనే ఉంటోంది. డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌సిటీ, ఈ-గవర్నెన్స్‌.. ఇలా అంతటా ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. దీంతో ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. ఇంటర్నెట్‌ రంగంలో ఇప్పుడు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ హవా నడుస్తోంది. గతంలో ఈ సేవల కోసం అందరూ నెట్‌ సెంటర్లకు వెళ్లే వారు. ఇప్పుడు  ఇంటికే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను తీసుకుంటున్నారు. దీంతో నగరంలో వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న సంస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

పెరుగుతున్న ఆదరణ 

డిజిటల్‌ ఇండియా నేపథ్యంలో స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్‌ వరంగల్‌లో ప్రస్తుతం ఇ-గవర్నెన్స్‌ పాలనపై అన్ని శాఖలు దృష్టి కేంద్రీకరించాయి. దీంతో పాలనా యంత్రాంగంతో పాటు జనం సైతం హైస్పీడ్‌ నెట్‌ను కోరుకుంటున్నారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇంటర్నెట్‌ వినియోగంపై మక్కువ చూపుతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో అరచేతిలో వైకుంఠాన్ని చుట్టేస్తున్నారు. ఈ-బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ రైల్వే, బస్‌టికెట్‌ రిజర్వేషన్లు ఊపందుకున్నాయి. వీటితో పాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైతం జోరుగా నడుస్తున్నది. దీనికి తోడు విద్యాపరంగా అన్ని రకాల అడ్మిషన్లు, ఎంప్లాయ్‌మెంట్‌ నోటిఫికేషన్లు, ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వంటివన్నీ ఇంటర్నెట్‌ ద్వారానే జరుగుతున్నాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో టచ్‌లో ఉండేందుకు వీడియో కాలింగ్‌, నెట్‌ఫ్రీ ఫోన్‌ మాట్లాడేందుకు బ్రాడ్‌బ్యాండ్‌ వారధిగా మారింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నగరంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్నాయి. జియో ఫైబర్‌, ఎయిర్‌టెల్‌ సంస్థలైతే ఒక అడుగు ముందుకేసి 4జీ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. సాధారణ ఇంటర్నెట్‌ కన్నా ఇది అత్యధిక వేగంగా పనిచేస్తుండడంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.  ప్రతినెలా కనీసం రెండు వందలకుపైగా కొత్త కనెక్షన్లు నమోదవుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

బ్రాడ్‌బ్యాండ్ల హవా!

80వ దశకం చివర్లో కేబుల్‌ టీవీ వ్యవస్థ ఎలా ఇంటింటికి పాకిందో.. ఇప్పుడు ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సైతం అదేస్థాయిలో విస్తరిస్తోంది. అప్పుట్లో వినోదమే ప్రధానంగా కేబుల్‌ కనెక్షన్లు విస్తరించగా, ఇప్పుడు వినోదం, విజ్ఞానం, వ్యాపార లావాదేవీలు, సమాచార బదిలీ వంటి అనేక రకాల సేవలను బ్రాడ్‌బ్యాండ్‌తో పొందే వీలుండడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు పలు ప్రైవేట్‌ సంస్థలు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్నాయి. వీటిలో ప్రతి సంస్థ కనీసం సగటున నెలకు 50 నుంచి రెండు వందల వరకు కొత్త కనెక్షన్లు ఇస్తున్నాయి. ఈ సేవలను సజావుగా అందించేందుకు ప్రతి సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద కనీసం 30 మంది వరకు పనిచేస్తున్నారు. 

వన్‌ ఎంబీపీఎస్‌కు డిమాండ్‌

బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 512 కేబీపీఎస్‌(కిలో బైట్స్‌ ఫర్‌ సెకన్‌) నుంచి ప్రారంభమై 10 ఎంబీపీఎస్‌(మెగా బైట్స్‌ ఫర్‌ సెకన్‌) వరకు నాలుగైదు ప్లాన్లలో లభిస్తున్నాయి. వీటిలో ఒక ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ప్లాన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉందని నిర్వాహకులు తెలిపారు. నగరంలో ఉన్న పలు కంపెనీలు, ఈ ప్లాన్‌ను నెలకు రూ.500 నుంచి రూ.750కు అందిస్తున్నాయి. ఇక పెద్ద కంపెనీలు, నెట్‌ సెంటర్ల నిర్వాహకులు 10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ప్లాన్‌, నెలకు రూ.వెయ్యికిపైగా ఉన్న ప్లాన్లను వినియోగిస్తున్నారు.

భవిష్యత్‌ బ్రాడ్‌బ్యాండ్‌దే..

ప్రతి ఇంటిలో ఇంటర్నెట్‌ చాలా ఉపయోగకరంగా మా రింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు మరింతగా విస్తరించాయి. నగరానికి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో వాడకం కూడా బాగా పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఇంటర్నెట్‌ రంగంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ఫైబర్‌ టు ది హోం(ఎఫ్‌టీటీహెచ్‌) ద్వారా కస్టమర్లకు టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ అందిస్తున్నాం. మారుతున్న కాలానికనుగుణంగా నూతన టెక్నాలజీతో వినియోగదారులకు మంచి సేవలందిస్తున్నాం.

- సురభి చంద్రశేఖర్‌రావు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కమ్యూనికేషన్స్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, బాలసముద్రం

వెరీ యూజ్‌ఫుల్‌

అన్నింటికీ  వాడకం బాగా పెరిగిపోయింది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో ఉండడం వల్ల ప్రస్తుతం ఎంతో యూజ్‌ఫుల్‌గా మారింది. విదేశాల్లో ఉన్న తమవారితో రెగ్యులర్‌గా వీడియో కాలింగ్‌ చేస్తున్నాం. ఇంట్లో అందరం సరదాగా రోజూ మాట్లాడుతూనే ఉంటాం. 

- కానుగంటి అరవింద్‌, కొత్తూర్‌జెండా

VIDEOS

logo