శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Aug 08, 2020 , 01:58:33

ఇంటి నిర్మాణం అనుమతి సులభం..

ఇంటి నిర్మాణం అనుమతి సులభం..

వరంగల్‌, ఆగస్టు 7 : ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతి సులభతరం కానుంది. పారదర్శకంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ -బీపాస్‌ విధానం అమలులోకి తీసుకురానుంది. గతంతో మాదిరిగా మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే అనుమతులు పొందేలా టీఎస్‌ బీపాస్‌ను రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో టీఎస్‌-బీపాస్‌ విధానంలో ఇంటి నిర్మాణాల అనుమతులు మంజూరు చేయనున్నారు. రెండు రోజుల క్రితం టీఎస్‌-బీపాస్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేయడంతో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రమంతా టీఎస్‌ బీపాస్‌ అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని టీఎస్‌ బీపాస్‌ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది.  కేవలం ఒక రూపాయి చెల్లిస్తే వెంటనే భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ జారీ అవుతుంది.  భవన నిర్మాణాల అనుమతులను 21 రోజుల్లో అందజేయనున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులను కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాట య్యే టీఎస్‌ బీపాస్‌ కమిటీ మంజూరు చేయనుంది. క్షేత్రస్థాయిలో తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు  భవన నిర్మాణాల అనుమతుల జారీలో కీలకంగా వ్యవహరించిన మున్సిపల్‌ శాఖకు ప్రస్తుతం కొత్తగా అమలు చేసే టీఎస్‌ బీపాస్‌లో ఎలాంటి పాత్ర లేకపోవడం గమనార్హం.

రూపాయి చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ పత్రం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న టీఎస్‌ బీపాస్‌ విధానంతో పేదలకు ఇంటి నిర్మాణం మరింత సులభతరం కానుంది. 75 గజాల స్థలంలో జీప్లస్‌1 వరకు ఇంటిని నిర్మించుకునే వారికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రిజిస్ట్రేషన్‌ పత్రాలు టీఎస్‌ బీపాస్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసి నామమాత్రంగా ఒక రూపాయి చెల్లిస్తే చాలు వెంటనే భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ ప్రతం వస్తుంది. ఇంటి నక్ష, లింక్‌ డాక్యుమెంట్‌ లాంటివి ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే అనుమతులు పొందే అవకాశం కల్పించారు. మున్సిపల్‌ సర్వేయర్ల పని లేకుండానే మీ సేవ కేంద్రాల ద్వారా భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 75 నుచి 200 గజాల వరకు(జీప్లస్‌1) టీఎస్‌ బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన వెంటనే  అనుమతి పత్రం పొందే అవకాశం ఇచ్చారు. మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగకుండా వెంటనే అనుమతి పత్రం పొందే అవకాశం టీఎస్‌ బీపాస్‌ ద్వారా కల్పించారు. 

స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు

 200 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల స్థలాల్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు మంజూ రు చేయనున్నారు. జీప్లస్‌ 2 భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణమే అనుమతులు ఇవ్వనున్నారు. నిబంధనల మేరకు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్యుఫెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. 500 చదరపు మీటర్లు ప్లాట్‌లో  జీప్లస్‌2 కంటే ఎక్కువ(10 మీటర్ల ఎత్తు)  అంతస్తుల నిర్మాణాల అనుమతులకు సింగిల్‌ విండో విధానంలో టీఎస్‌ బీపాస్‌ కమిటీ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నారు. ఎన్‌వోసీల కోసం ఇతర శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టీఎస్‌ బీపాస్‌ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నారు.

క్షేత్రస్థాయిలో తనిఖీ

స్వీయ ధ్రువీకరణలతో తక్షణ అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో  క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవాలను తప్పుగా చూపినా, నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు, భారీ జరిమానాలు విధించనున్నారు.

21 రోజుల్లో అనుమతులు

టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఎలాంటి నిర్మాణాలకైనా 21 రోజుల్లో అనుమతులు లభించనున్నాయి. 21 రోజులు దాటిన తర్వాత పెండింగ్‌లో ఉన్నా అనుమతి ఇచ్చినట్లుగానే భావించాలని  పెట్టారు.  21 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో అనుమతి పత్రాన్ని దరఖాస్తుదారుడు తీసుకునే అవకాశం ఉంటుంది. బహుళ అంతస్తులకు కలెక్టర్‌ అధ్యక్షతన టీఎస్‌ బీపాస్‌ కమిటీ  అనుమతులు ఇవ్వనుంది. కలెక్టర్‌, కమిషనర్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పోలీసు శాఖల నుంచి అధికారులు బీపాస్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే కమిటీలో ఉన్న వివిధ శాఖ అధికారుల లాగిన్‌లోకి వెళుతుంది. దీంతో వెంటనే అనుమతులకు సంబంధించి, ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎక్కడా పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిశీలించి 21 రోజుల్లో అనుమతి మంజూరు చేయనున్నారు. 

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు 

భవన నిర్మాణ అనుమతుల్లో ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేసేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. భవన నిర్మాణాల అనుమతుల్లో ఇబ్బందులు కలిగితే వెంటనే టీఎస్‌ బీపాస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 22666666కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణ అనుమతులు సులభంగా, పారదర్శకంగా మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ను అమలులోకి తీసుకువస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ బీపాస్‌ ద్వారా భవన నిర్మాణాల అనుమతులు మంజూరు ప్రక్రియను అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు బల్దియా అధికారులు తెలిపారు. 


logo