శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - May 12, 2020 , 01:41:57

కార్యాలయాలు కళకళ

కార్యాలయాలు కళకళ

  • తెరుచుకున్న ప్రభుత్వ ఆఫీసులు 
  • వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 33శాతం..
  • మిగతా ఐదు జిల్లాలో వందశాతం హాజరు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ :  మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది. ఈ నేపథ్యంలో 48 రోజులుగా మూతపడిన ప్రభుత్వ ఆఫీసులు సోమవారం తెరుచుకున్నాయి. కొన్ని రోజులుగా ఉద్యోగులు లేక వెలవెలబోయిన కార్యాలయాలు మళ్లీ సందడిగా మారాయి. ఉద్యోగులు, సిబ్బంది, పని నిమిత్తం వచ్చిన ప్రజలతో కళకళలాడాయి. ఉద్యోగులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించి విధులు నిర్వర్తించగా, కార్యాలయాలకు వచ్చే ప్రజలు సామాజిక దూరం  పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా పాజిటివ్‌  కేసుల ఆధారంగా కేంద్ర ప్రభు త్వం దేశంలోని ఆయా ప్రాంతాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా గుర్తించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రెడ్‌జోన్‌లో 33 శాతం, ఆరెంజ్‌, గ్రీన్‌లో వంద శాతం మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా వెసులుబాటు కల్పించింది. కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువ నమోదు కావడంతో రెడ్‌జోన్‌లో చేర్చారు. దీంతో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమైనప్పటికీ 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. ఉద్యోగు లు, సిబ్బంది వందశాతం విధులు నిర్వర్తించారు. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అధికారులు, సిబ్బంది సోమవారం విధులకు హాజరయ్యారు. పెండింగ్‌ పనులను పూర్తి చేస్తూ బిజీబిజీగా కనిపించారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న ములుగు, జనగామ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేర కు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.  


logo